సాక్షి, అమరావతి : గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం ప్రతిపక్ష టీడీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తున సీనియర్లు పార్టీని వీడగా.. మరికొంత మంది నేతలు సైతం అదేదారిలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఘోర పరాజయంతో పాటు మూడు రాజధానులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవలంభిస్తున్న తీరు ఆపార్టీ నేతలకు ఏమాత్రం మింగుడుపడటంలేదు. అంతేకాకుండా ఒకరి తరువాత ఒకరు సీనియర్లు పార్టీని వీడటం ఇతరులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీలోనే కొనసాగితే రాజకీయ భవిష్యత్ అంధకారంలోకి వెళ్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఈ క్రమంలో కొందరు సైకిల్ పార్టీకి రాజీనామా చేసి అధికార వైఎస్సార్‌సీపీలో చేరగా.. మరికొందరు మాత్రం అటుఇటు తేల్చుకోలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. రాజకీయ భవిష్యత్‌పై చంద్రబాబు నాయుడు నుంచి ఎలాంటి భరోసా రాకపోవడంతో తమ దారి తాము చూసుకుంటామని పచ్చ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ సైతం దూకుడు పెంచింది. టీడీపీ అసంతృప్తి నేతలపై గాలం వేస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి టీడీపీ నేతల్ని చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గంగా గుర్తింపు పొందిన కాపులను ఎక్కువగా ఆకర్శిస్తోంది. దీనిలో భాగంగా ఉత్తరాంధ్రలో టీడీపీ ముఖ్యనేతగా ఉన్న ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌తో బీజేపీ నేతలు మంతనాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గత ఎన్నికల్లో ఓటమి నుంచి ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. చంద్రబాబుతో పాటు జిల్లా నేతలకు కూడా అందుబాటులో ఉండటంలేదు. అంతేకాకుండా టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని తనకంటే జూనియర్ అయిన అచ్చెన్నాయుడుకి అప్పగించడం పట్ల కళా వెంకట్రావ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆయన వర్గీయుల ద్వారా తెలుస్తోంది. ఈ పరిణామాలను గమనించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రానున్న రెండు మూడు రోజుల్లో ఆయన్ను కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తారని చర్చసాగుతోంది. ఆయనతో పాటు పలువురు టీడీపీ అసంతృప్త నేతల్ని కూడా బీజేపీకి చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఇప్పటికే ఉత్తరాంధ్రలో చావుదెబ్బ తిన్న టీడీపీకి కళా వెంకట్రావ్ రూపంలో భారీ షాక్ ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment