సాక్షి, అమరావతి: టీడీపీ మనుగడపై ఆ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులకు రోజురోజుకూ నమ్మకం సన్నగిల్లుతోంది. ప్రతిపక్ష పాత్ర సమర్థంగా పోషించాలని ప్రజలు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడం, అంచనాలను అందుకోవడంలో నాయకత్వం దారుణంగా విఫలమైందని, అస్తవ్యస్త విధానాలతో ఉనికి కోల్పోయి కొట్టుమిట్టాడుతోందని టీడీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రజల నాడి గుర్తించే సత్తా నాయకత్వానికి లేదని, పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించే కార్యక్రమం ఒక్కటి కూడా ఈ మూడేళ్లలో చేపట్టలేదని అంగీకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను విమర్శించడం, అడ్డుకోవడం ద్వారా ప్రజాగ్రహానికి గురవుతున్న విషయాన్ని గుర్తించాలని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తేనే కలసి వస్తుందని, టీడీపీ అంతర్గత సమావేశాల్లో నాయకులు, కార్యకర్తలు పలుమార్లు హెచ్చరిస్తున్న ఘటనలు ఇటీవల బాగా పెరిగాయి. వీటిని ఆమోదిస్తే మరింత మంది గళం విప్పుతారనే భయంతో అధినేత గోడ మీది పిల్లిలా వ్యవహరిస్తున్నారని పార్టీలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అదే అభిప్రాయంతో సీనియర్లు..
పార్టీని గెలిపించే శక్తి, యుక్తి చంద్రబాబుకు లేవని తాజాగా ఓ ఎంపీ కూడా అంతర్గత సమావేశాల్లో వ్యాఖ్యానించారు. పార్టీలో చాలామంది సీనియర్లు ఇప్పటికే ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఇక లోకేష్ గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. ‘పార్టీ లేదూ.. బొ. లేదూ’ అని తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. పార్టీ బలహీన పడిన ఈ సమయంలో మహారాష్ట్రలో మాదిరిగా టీడీపీలోనూ ఏక్‌నాథ్ షిండేలకు కొదవలేదనే వ్యాఖ్యలు పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment