సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేవలం రాజకీయ కక్ష అని వస్తున్న ఆరోపణలపై బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్ మండిపడ్డారు. ఇది కేవలం ఒక రాజకీయ కక్షసాధింపే అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరూ అన్ని మొబైల్ ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ అయినవాళ్లు మీ పేర్లు ఎందుకు చెబుతున్నారు? అని ప్రశ్నించారు.
కేసీఆర్ కుటుంబం మొత్తం యావత్ తెలంగాణను లూటీ చేస్తోందని ఛుగ్ ఆరోపించారు. ఈ మేరకు తరుణ్‌ఛుగ్ శనివారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబం కేవలం తెలంగాణను దోచుకోవడమే కాకుండా... పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాలను కూడా దోచుకునే ప్రయత్నం చేశారని... తమ అవినీతిని ఇక్కడి వరకు విస్తరించారని ధ్వజమెత్తారు. చట్టం అందరికీ ఒకటేనని.. అందరికీ సమానమే అన్న విషయాన్ని కేసీఆర్ కుటుంబం గుర్తించాలన్నారు. గొప్ప కుటుంబంలో జన్మించినంత మాత్రాన వారు చట్టానికి అతీతులు కారని, కేసీఆర్ కుటుంబంట ఈవినీతిలో మునిగిపోయిందని మండిపడ్డారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ, పంజాబ్ లిక్కర్ పాలసీల్లో జరిగిన అవినీతిలో కేజ్రీవాల్, కేసీఆర్ ఇద్దరూ ఉన్నారని ఆరోపించారు. అందుకే కేసీఆర్, కవిత పదే పదే ఢిల్లీ వస్తున్నారని విమర్శించారు. లిక్కర్ కుంభకోణంలో నేడు సాక్షిగా పిలిచినా, విచారణతోనే పాలు, నీళ్లు వేరవుతాయని.. నిందితులు ఎవరో, సాక్షులు ఎవరో తేలుతుందని వ్యాఖ్యానించారు. మాఫియా తరహాలో వ్యవహరిస్తున్నారని, కొడుకు, కూతురు వేరేగా, అల్లుడు వేరేగా తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపించారు. మద్యం కుంభకోణంపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
అది తప్పుడు కేసు..
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు ఒక తప్పుడు కేసు అనీ, అక్కడ ఎలాంటి లావాదేవీలు జరగలేదని తరుణ్ ఛుగ్ అన్నారు. టీఆర్‌ఎస్ శాసనసభ్యులను, నేతలను కొంటున్నారని ఇతర పార్టీలపై ఆరోపణలు చేసే ముందు అసలు తమ పార్టీ నేతలు ఎందుకు పార్టీని వీడి వెళ్తున్నారో ఆత్మావలోకనం చేసుకోవాలని సూచించారు. రఘునందన్, ఈటల రాజేందర్ లేదా మరెవరైనా సరే టీఆర్‌ఎస్ పార్టీని వీడి బయటికొచ్చే పరిస్థితి ఎందుకు కలిగిందని ప్రశ్నించుకోవాలన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని.. ప్రధాని మోదీకి దేశమంతటా ఉన్న ఆదరణను తెలంగాణ ప్రజలు సైతం ఆహ్వానిస్తున్నారని ఛుగ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment