
సాక్షి, హైదరాబాద్: సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు బీజేపీ సోషల్ మీడియా వింగ్‌లో కలకలం రేపాయి. ఈ పోస్టులపై సోషల్‌వింగ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే రెండు వర్గాలుగా విడిపోయింది. కొన్నిరోజుల కిందటివరకు నేతల గ్రూపుల విభేదాలు బయటపడగా.. సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు తాజా వివాదానికి కారణమయ్యాయి. రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కించపరిచే విధంగా పోస్ట్‌లు పెడుతున్నారని పలువురు ఈటల వర్గీయులు సోషల్ మీడియా వింగ్ వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేతల కేంద్రంగా కాకుండా, పార్టీకి మేలు చేసేలా పోస్టులు ఉండాలని సూచించారు. బండి సంజయ్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పించొచ్చని వార్తలొచ్చిన సందర్భంగా అటు బండి వర్గం, ఇటు ఈటల వర్గం ఒకరికి ఒకరు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో తాజాగా పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జుల సమావేశానికి నాంపల్లి కార్యాలయానికి వచ్చిన ఈటల వర్గీయులు... ఈటలకు వ్యతిరేకంగా కొందరు పోస్టులు పెట్టడంపై స్టేట్ ఆఫీస్ సోషల్ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు.
ఈ సందర్భంగా బండి, ఈటల వర్గాలు పరస్పరం దూషించుకున్నాయి. బీజేపీ సోషల్ మీడియా ఉద్యోగి ప్రశాంత్‌పై కొందరు దూషణకు దిగారు. వీరిలో ఈటల, కిషన్ రెడ్డి అనుచరులు అమర్ నాథ్, గిరివర్ధన్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. సోషల్ మీడియా రూమ్‌కు తాళం వేసి మరీ దాడికి ప్రయత్నించినట్టు, ఈటలకు అనుకూలంగా కొందరు నినాదాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. బీజేపీ కార్యాలయ సిబ్బంది ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది.
చదవండి: రేవంత్ ‘ఉచిత’ ఉపన్యాసం.. ఆత్మరక్షణలో కాంగ్రెస్.. చేజేతులా!
Comments
Please login to add a commentAdd a comment