సాక్షి, హైదరాబాద్: రిజర్వ్‌డ్ సీట్లపై కన్నేసిన కమలం పార్టీ వచ్చే ఎన్నికల్లో వాటిని కైవసం చేసుకునేదిశగా కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ అసెంబ్లీ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులను ముందే గుర్తించాలని నిర్ణయించింది. ఈ సీట్లలో పార్టీ పరిస్థితి, ప్రజాసమస్యలు, ఇతర అంశాలపై ‘గ్రౌండ్ రిపోర్ట్’కోసం త్వరలోనే బృందాలను పంపించనుంది. ఒక వర్కింగ్ పేపర్ ద్వారా పోలింగ్ బూత్‌స్థాయిలోనే క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి, పార్టీపరంగా ఇద్దరేసి బలమైన అభ్యర్థులను (ముఖ్యనేతలు ప్రాతినిధ్యం వహించే స్థానాలు మినహాయించి) గుర్తించనుంది.
దీంతోపాటు అన్ని ఎస్సీ నియోజకవర్గాల్లో ‘కేసీఆర్‌పై దళిత అదాలత్’లు నిర్వహించాలని నిర్ణయించింది. గత ఏడేళ్లలో దళితులకు సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానాలు, వాటిల్లో ఎన్ని అమలయ్యాయి, సమస్యలు ఏ మేరకు పరిష్కారమయ్యాయనే అనే అంశాలపై సర్కారును నిలదీయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేయనుంది.
ఎక్కడికక్కడ ప్రజలు స్పందించేలా చూడాలని భావిస్తోంది. రాష్ట్రంలోని 19 ఎస్సీ స్థానాల పరిస్థితిపై చర్చించేందుకు ఈ వర్గ ముఖ్యనేతలతో వర్క్‌షాపు నిర్వహించిన విషయం తెలిసిందే. అదేవిధంగానే 12 ఎస్టీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిస్థితుల పరిశీలనకు త్వరలోనే ఈ వర్గ ముఖ్యనేతలతో వర్క్‌షాపు ఏర్పాటు చేసి, ఆ తర్వాత కార్యాచరణ అమలు చేయనుంది.
‘మిషన్–19’కు నాయకత్వం అభినందనలు
ఎస్సీ సీట్లపై ‘మిషన్–19’వర్క్‌షాపు నిర్వహించడంపై బీజేపీ జాతీయ నాయకత్వం అభినందించింది. ఇందులో పార్టీనేతలు ఇచ్చిన సలహాలు, సూచనల గురించి జాతీయ నాయకత్వానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వివరించారు. ఎస్సీ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టడాన్ని అధిష్ఠానం అభినందిస్తూనే దీనికి అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని భరోసానిచ్చింది. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టానికి రోడ్‌మ్యాప్ సిద్ధం చేయడంతోపాటు ఆరేడుమంది సభ్యులతో సమన్వయకమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.
రెండేళ్ల పూర్తి సమయం పార్టీకి కేటాయించేవారికి, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉన్నవాళ్లకు సమన్వయ కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని, మొత్తంగా పాత–కొత్తల కలయికగా ఉండాలని సంజయ్‌కు నాయకత్వం సూచించినట్టు పార్టీవర్గాల సమాచారం. జనవరి మొదటివారంలో ఈ కమిటీసభ్యులతోపాటు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలతో సంజయ్ సమావేశం కానున్నారు.
జనవరి 5, 6 తేదీల నుంచి 19 ఎస్సీ నియోజకవర్గాల్లో ఈ కమిటీ పర్యటించనున్నట్టు తెలిసింది. ఈ సమన్వయ కమిటీ తొలుత తన కరీంనగర్ ఎంపీ సీటు పరిధిలోని మానకొండూరు, చొప్పదండిలలో పర్యటించి ఆయా అంశాలను సమీ„ìక్షించాలనే యోచనలో సంజయ్ ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment