కోదాడ బహిరంగ సభలో అభివాదం చేస్తున్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
కోదాడ: తెలంగాణ అంటే కరప్షన్.. కలెక్షన్.. కేసీఆర్.. అన్నట్లు తయ్యారైందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. విద్యార్థుల బలిదానం, మేధావుల శ్రమదానం, తెలంగాణ వాదుల పోరాటంతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వ అధినేతలు అవినీతిలో కూరుకొని పోయారన్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదనే సామెతను నిజం చేస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పడి దోచుకుంటున్నారని మండిపడ్డారు.
రాజ్యాధికార యాత్రలో భాగంగా ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బాలుర పాఠశాలలో నిర్వహించిన సభ లో ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు. రైతులు ధాన్యం కొనేవారు లేక ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు విమానాల్లో ఢిల్లీ వెళ్లి గంట సేపు ధర్నా చేసివచ్చారని, దానివల్ల రైతులకు ఒరిగింది ఏమిటని ఆయన ప్రశ్నించారు.
రాజ్యాధికారం చేతికి వచ్చినపుడే బహుజనులు అభివృద్ధి చెందుతారని, పల్లకీ బోయిలుగా కాకుండా పల్లకిలో కూర్చోవడానికి కృషి చేయాలని కోరారు.వచ్చే ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలకు తమ పార్టీ 70 శాతం సీట్లను కేటాయిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మేధావులు మౌనంగా ఉండవద్దని బయటికి వచ్చి మేలు చేసే వ్యక్తులను అధికారంలో కూర్చోబెట్టాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పిల్లుట్ల శ్రీనివాస్, గుండెపంగు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment