సాక్షి, హైదరాబాద్: తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిందా? విస్తరణ ఇప్పటికే ఆలస్యం అయిందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా? మంత్రివర్గంలో కొత్తగా ఎవరికి పదవులు ఇవ్వాలో కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేసేసిందా? ఇంతకీ ఎవరెవరికి రేవంత్ క్యాబినెట్‌లో బెర్త్‌లు కన్‌ఫాం అయ్యాయి? పదవుల కోసం పైరవీలు ఏ స్థాయిలో జరుగుతున్నాయి?
అతి త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకునేలా, ఈ నెలాఖరులోగా క్యాబినెట్ విస్తరణ జరగబోతోంది. ఇప్పటికే సామాజిక సమీకరణాలపై కసరత్తు చేసిన కాంగ్రెస్ అదిష్టానం సీఎం రేవంత్‌రెడ్డితో మరోసారి చర్చించి నిర్ణయం తుది నిర్ణయం తీసుకోనుంది.
ప్రస్తుత క్యాబినెట్ లో నాలుగు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించలేదు. విస్తరణలో ఆ నాలుగు జిల్లాలకు కచ్చితంగా చోటు కల్పించాల్సి ఉంటుంది. ప్రస్తుత క్యాబినెట్ లో రెడ్డి సామాజిక వర్గం నుంచి నలుగురు, బీసీ, ఎస్సీ సామాజికవర్గాల నుంచి ఇద్దరు చొప్పున, ఎస్‌టీ, కమ్మ, వెలమ సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు
క్యాబినెట్ విస్తరణలో ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్‌రావు బెర్త్ ఆశిస్తున్నారు. ఇప్పటికే మాల సామాజిక వర్గం నుంచి భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం, గడ్డం ప్రసాద్ కు స్పీకర్ పదవి వచ్చారు. అందువల్ల మాల కమ్యూనిటీకే చెందిన వివేక్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించడం పట్ల కాంగ్రెస్ నేతలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి వెలమ వర్గానికి చెందిన ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవి ఆశిస్తున్నా.. ఆయనకు పోటీగా ఉమ్మడి నిజామాబాద్ నుంచి మదన్ మోహన్ రావు కూడా పోటీ పడుతున్నారు. అయితే ఇప్పటికే వెలమ సామాజిక వర్గం నుంచి జూపల్లి కృష్ణారావుకు మంత్రి వర్గంలో చోటు కల్పించడంతో ఈ ఇద్దరిలో ఒకరికైనా అవకాశం ఇస్తారో లేదో చూడాలి.
ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి రేసులో ఉండగా..ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌లో ఇప్పటికే సీఎంతో కలుపుకుని నలుగురు రెడ్డి వర్గం మంత్రులున్నారు. రెడ్డి వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి ఇస్తారని భావిస్తున్నా..సుదర్శన్‌రెడ్డి.. మల్‌రెడ్డిలో ఎవరికి ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత క్యాబినెట్‌లో బీసీ సామాజికవర్గాల్లో మున్నూరు కాపు, గౌడ్‌లకు ప్రాతినిధ్యం కల్పించారు. అందువల్ల ఇతర బీసీ వర్గాల్లో ప్రాబల్యం ఉన్న మరో కులానికి చెందిన నేతకు విస్తరణలో మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.
కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆరుగురు బీసీ ఎమ్మెల్యేల్లో ఇద్దరు మంత్రులు, ఇద్దరు విప్‌లుగా పదవులు పొందారు. మరో ఇద్దరు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్.. రజకవర్గానికి చెందిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ల్లో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఆదివాసీల నుంచి సీతక్కకు ఇప్పటికే మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. విస్తరణలో ఎస్టీ లంబాడ నుంచి ఒకరికి అవకాశం దక్కబోతోంది. అందులో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కు ఇస్తారనే టాక్ వినిపిస్తోంది.
ఇక ఒక మైనారిటీకి కచ్చితంగా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. కానీ ప్రస్తుతం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గాని ఎమ్మెల్సీగా గాని ఒక్క మైనారిటీ నేత కూడా లేరు. దీంతో పలువురు మైనారిటీ నేతల పేర్లను కాంగ్రెస్ అదిష్టానం పరిశీలిస్తోంది. దీనికి తోడు గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేలు లేరు. ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరినైనా ఆకర్షించి మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది.
ఇక మాదిగ సామాజిక వర్గ నేతలు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. మాదిగ వర్గం నేతకు పదవి ఇవ్వడం ద్వారా ఎస్సీ వర్గీకరణతో మాదిగ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్న బీజేపీని కౌంటర్ చేయొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా తన క్యాబినెట్లో సామాజిక న్యాయం పాటించేలా క్యాబినెట్ విస్తరణ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ఆలోచన ఎంత మేరకు అమలవుతుందో చూడాలి.
ఇదీచదవండి.. పార్లమెంట్ సన్నాహాలతో బీఆర్‌ఎస్ శ్రేణుల చైతన్యం
Comments
Please login to add a commentAdd a comment