సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రధాని మోదీ జాతి సంపదను, సీఎం కేసీఆర్ రాష్ట్ర సంపదను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ దేశానికి ప్రమాదకరంగా మారారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్ర ఆస్తులను అమ్ముకోవడానికి తెలంగాణ తెచ్చుకోలేదని, హైదరాబాద్ శివారు భూములను నిధుల సేకరణ పేరుతో విక్రయించడం సరికాదని, భూముల అమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. శనివారం ఆయన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం ఆవుడంలో పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు బలహీన వర్గాలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే, డబుల్‌బెడ్రూం ఇళ్లు ఇస్తామని బీఆర్‌ఎస్ ప్రభుత్వం హౌసింగ్ కార్పొరేషన్ ఎత్తివేసిందని విమర్శించారు. పేదలు ఇళ్లు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్‌ను తలకిందులు చేసిన టీఎస్‌పీఎస్సీని రద్దు చేయాల్సిందిగా రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. నిరుద్యోగ భృతిని నాలుగేళ్లకు లెక్కగట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతూ బెదిరిస్తున్నారని, గిరిజనులు ఏళ్లుగా సాగు చేసుకుంటున్న అటవీ భూముల్లో కందకాలు తవ్వుతూ ఇబ్బందిపెడుతున్నారని ధ్వజమెత్తారు.
రూ.42 వేల కోట్లు ఖర్చు చేసి పైపుల కోసమే మిషన్‌భగీరథ పథకం తెచ్చారని, కానీ ఎక్కడా తాగునీరు రావడం లేదని తెలిపారు. తెలంగాణలోనూ మద్యం కుంభకోణం తెలంగాణ మోడల్ మద్యం పాలసీ ఢిల్లీలో కుంభకోణమైతే, రాష్ట్రంలో కూడా రూ.వేల కోట్ల మద్యం స్కాం జరిగినట్లు అనుమానాలు ఉన్నాయని విక్ర మార్క ఆరోపించారు. సర్కారే బెల్టుషాపులు పెట్టించి, మద్యం అమ్మిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర మద్యం పాలసీపై సమగ్ర విచారణ జరపాలని, దీనిపై దర్యాప్తు సంస్థలకు లేఖ రాస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment