సాక్షి, హైదరాబాద్: ‘దళితబంధు పథకాన్ని నిధులు లేకుండా ఒట్టిగా అమలు చేస్తామంటున్నారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో సీఎం దళిత సాధికారత పథకం కోసం రూ.వెయ్యి కోట్లు మాత్రమే ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 17 లక్షల దళిత కుటుంబాలకు రూ.లక్షా 70 వేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తామని దళిత ప్రజాప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మీరు చెప్పినట్టు దీనికి నిధులు ఎలా సమకూరుస్తారో స్పష్టత ఇవ్వాలి’అని కాంగ్రెస్ శాసనసభాపక్షనేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
దళితబంధుపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆలోచనలు గొప్పగా ఉన్నా, వాటి అమలుపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ పథకం అమలు కావాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని చెప్పారు. ఈ పథకాన్ని రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ అమలు చేయాలని కోరారు. ముస్లింలు, బీసీలు, ఈబీసీలకు సైతం ఇలాంటి పథకాన్ని అమలు చేయాలని సూచించారు.
స్పష్టత ఇవ్వాలి...
దళితబంధు కింద లబ్ధిదారులకు రూ.10 లక్షలు ఇస్తే వాళ్లు రెండు, మూడు వ్యాపారాలు చేసుకోవచ్చా.. వారికి నచ్చే వ్యాపారం చేసుకోవచ్చా.. అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని భట్టివిక్రమార్క కోరారు. పెద్దఎత్తున వ్యాపారం చేసుకోవాలని అనుకుంటే పదిమంది కలుసుకుని చేసుకోవచ్చా.. అని ప్రశ్నించారు. ఉన్న మండలంలోనే వ్యాపారాలు చేసుకోవాలా? నచ్చిన ప్రాంతాల్లో చేసుకునే అవకాశం ఉందా? అని అడిగారు. రేషన్‌కార్డు లేనివారిని కుటుంబంగా పరిగణించరా? పెళ్లి అయినవారిని పరిగణనలోకి తీసుకుంటారా అన్న అంశంపై స్పష్టత కోరారు.
Comments
Please login to add a commentAdd a comment