Telangana CM KCR Activity Targeting National Politics: కేసీఆర్‌ దూకుడు.. టార్గెట్‌ ఢిల్లీ!.. - Sakshi
Sakshi News home page

National Politics: కేసీఆర్‌ దూకుడు.. టార్గెట్‌ ఢిల్లీ!..

Published Tue, Feb 15 2022 3:53 AM | Last Updated on Tue, Feb 15 2022 10:41 AM

Telangana CM KCR Activity Targeting National Politics - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు సిద్ధమని ప్రకటిస్తున్న టీఆర్‌ఎస్‌ అధినేత ఆ దిశగా ప్రయత్నాలు వేగవంతంపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తున్నారు. రాష్ట్ర సమస్యలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ సీఎం కేసీఆర్‌ గత కొన్నాళ్లుగా నిప్పులు చెరుగుతున్నారు. బీజేపీని బంగాళాఖాతంలో కలపాలని, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని పిలుపునిస్తున్న ముఖ్యమంత్రి ఆ దిశగా కార్యాచరణ కూడా ప్రారంభించారు. బీజేపీయేతర ముఖ్యమంత్రులు, ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతూ జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర ప్రతిపక్షాన్ని బలంగా తయారు చేయడంలో కీలక పాత్ర పోషించేలా అడుగులు ముందుకు వేస్తున్నారు.

త్వరలో ముంబయికి వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రేతో భేటీ కానున్నట్టు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ త్వరలో హైదరాబాద్‌కు వస్తారని ప్రకటించారు. గతంలో మమతా బెనర్జీతో పాటు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తదితరులతో భేటీ అయిన కేసీఆర్‌.. ఇటీవలి కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, వామపక్ష నాయకులు సీతారాం ఏచూరి, ఎ.రాజాతో, అలాగే ఆర్‌జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్‌తోనూ సమావేశమైన విషయం తెలిసిందే.

త్వరలో ఢిల్లీలో బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతుందని తమిళనాడు సీఎం స్టాలిన్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించగా, ఇటీవల తాను తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులతో మాట్లాడిన విషయాన్ని మమతా బెనర్జీ సోమవారం వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా జరిగే బీజేపీయేతర సీఎంల సమావేశం ఎజెండా అంశాలను రూపొందించే పనిలో కేసీఆర్‌ ఉన్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి.

మరోవైపు బీజేపీ, నరేంద్ర మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై ఈ భేటీలో పలు నివేదికలు విడుదల చేసేలా కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షతో పాటు నిరుద్యోగం, విద్యుత్‌ సంస్కరణలు, పారిశ్రామిక వృద్ధి తిరోగమనం, రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి వంటి అంశాలు ఈ నివేదికల్లో పొందుపరిచే అవకాశముందని తెలుస్తోంది. 

వైఫల్యాలు, అవినీతి ఆరోపణలపై అధ్యయనం 
ఎనిమిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై జాతీయ స్థాయిలో వివిధ రంగాలకు చెందిన నిపుణులతో కేసీఆర్‌ నిరంతరం సంప్రదింపులు, చర్చలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సుమారు ఏడాదికాలంగా ఆయన జాతీయ అంశాలు, రాజకీయాలపై ఈ తరహా కసరత్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

బీజేపీ అనుసరిస్తున్న విదేశాంగ, ఆర్థిక, అభివృద్ధి, సంక్షేమ విధానాలు, వాటి వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని కేసీఆర్‌ అధ్యయనం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ రాష్ట్రాల హక్కులు హరించి వేస్తుందనే విమర్శలను సాక్ష్యాధారాలతో వివరించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం వివిధ సందర్భాల్లో విడుదల చేసిన నివేదికలపై దృష్టి పెట్టారు.

ఇటీవలి కాలంలో రాష్ట్రాల పాలన వ్యవహారాల్లో గవర్నర్లు జోక్యం చేసుకుంటున్న తీరు తదితరాలకు సంబంధించి వివిధ వర్గాల నుంచి అందుతున్న వివరాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ అధ్యయనంలో తేలిన అంశాల మేరకే ఇటీవలి జనగామ, భువనగిరి బహిరంగ సభలతో పాటు రెండురోజుల క్రితం మీడియా సమావేశంలో కేసీఆర్‌ పలు వ్యాఖ్యలు చేశారని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి.

కాంగ్రెసేతర కూటమి లేదా ప్రత్యేక పార్టీ.. 
దశాబ్దాలుగా సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడంలో కాంగ్రెస్, బీజేపీది ఒకే తరహా విధానమని ఆరోపిస్తున్న బీజేపీయేతర పార్టీలు జాతీయ స్థాయిలో కొత్త కూటమి లేదా పార్టీగా ఏర్పడే అవకాశాలున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రాల్లో ఎవరికి వారుగా ప్రాంతీయ అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే జాతీయ స్థాయిలో ఏకం కావాల్సిన తీరు, విధి విధానాలు, అందుకు అడ్డంకిగా ఉండే అంశాలపై ఇప్పటికే టీఆర్‌ఎస్, టీఎంసీ, ఆర్‌జేడీ, సమాజ్‌వాదీ తదితర పార్టీల మధ్య చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. సమాఖ్య వ్యవస్థను కాపాడేందుకు ప్రాంతీయ పార్టీలు అవగాహనకు రావాలని మమతా బెనర్జీ తాజాగా చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. కాంగ్రెస్‌తో నిమిత్తం లేకుండా, తమ దారిలో తాము వెళ్లాలనే అభిప్రాయం బీజేపీయేతర పార్టీల్లో వ్యక్తమవుతోందని టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement