సాక్షి, హైదరాబాద్: ‘‘రాజ్యాంగం ద్వారా లభించిన అవకాశాలతో కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా 50 ఏండ్లు ప్రజా జీవితంలో ఉన్న అనుభవంతో చెప్తున్నా.. ప్రస్తుత వ్యవస్థతో ఏదీ మారదు. ఈ దేశంలో కొత్త రాజ్యాంగం రాయాల్సిన అవసరం ఉంది. దేశం ముందు నేను పెడుతున్న ఈ ప్రతిపాదనపై చర్చ జరగాలి..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. చాలా దేశాలు తమ రాజ్యాంగాన్ని తిరిగి రాసుకున్నాయని.. కొత్త ఆలోచన, కొత్త దిశ, కొత్త రాజ్యాంగం అన్నది తమ విధానమని వెల్లడించారు. సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..
వారి చేతగానితనంతోనే అంధకారం
‘‘స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా అంతా దారుణం. మనది ధనవంతమైన దేశమైనా ఆలోచనలో పేదరికం ఉంది. ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా తయారయ్యే సామర్థ్యమున్నా కాంగ్రెస్, బీజేపీల చేతగానితనం వల్లే అంధకారంలో ఉంది. దేశాన్ని పాలిస్తున్న ప్రధాని, ప్రభుత్వం చెప్తున్నవన్నీ అబద్ధాలే. ఇదో పనికిమాలిన చెత్త ప్రభుత్వం. అబద్ధాలతో, మత పిచ్చి రేపుతూ, ధర్మం పేరిట దేశాన్ని విభజిస్తోంది. ఈ దేశ యువత, ప్రజానీకానికి పిలుపునిస్తున్నా. రేపటి భవిష్యత్తు, దానిని కాపాడే బాధ్యత మీదే. బీజేపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపితేనే అభివృద్ధి సాధ్యం. త్వరలో మా కార్యాచరణ ప్రారంభిస్తాం.
దేశం కోసం బయల్దేరుతున్నాం
దేశంలో నూతన శకం, గుణాత్మక మార్పు రావాల్సి ఉంది. అబద్ధాలు చెప్పే వారితో ఒకట్రెండు రోజులు మాత్రమే సంతోషం.. సమస్యలు పరిష్కారం కావు. ప్రతీ పౌరుడు దేశం కోసం పనిచేయొచ్చనే ఉద్దేశంతో.. మేం దేశం కోసం బయలుదేరుతున్నాం. భారత్‌లో సాగుయోగ్యమైన 40 కోట్ల ఎకరాల్లో ప్రతీ అంగుళానికి నీరు ఇవ్వగలం. రెండేళ్లలో దేశాన్ని అభివృద్ధితో మెరిసేలా చేసి ప్రపంచానికి చూపుతాం. నీళ్లు, విద్యుత్ వినియోగంలో నేను చెప్పిన లెక్కలు అబద్ధమని రుజువు చేస్తే.. నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేస్తా.
పదవికాదు.. కొత్త ఎజెండా కావాలి
ఫెడరల్ ఫ్రంట్ అని నేను ఏనాడూ చెప్పలేదు. ప్రధాని పదవి ఎవరికి దక్కుతుందనేది అప్రస్తుతం. దేశానికి కొత్త ఎజెండా కావాలి. రేపు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ప్రజలను జాగృతం చేసేందుకు ఏ పద్ధతిలో ముందుకు పోవాలనే దానిపై త్వరలో హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల సదస్సులో మేధోమథనం చేస్తాం. విప్లవాల కోసం తుపాకీ అవసరం లేదు. నాగరిక ప్రపంచంలో ఇందిరాగాంధీ వంటి నాయకురాలు గద్దె దిగింది.
తెలంగాణ బిడ్డ వెలిగితే అభ్యంతరమా?
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ముస్లిం సమాజానికి ఒక దిక్కుగా మారాలనుకుంటున్నారు. ఉమ్మడి ఏపీలో తమ రాజకీయ మనుగడను నిలుపుకొన్న ఎంఐఎం.. ఇప్పుడు మహారాష్ట్ర, బిహార్ వంటి చోట్లా తమ ఉనికిని చాటుతోంది. ఒక తెలంగాణ బిడ్డ దేశవ్యాప్తంగా విస్తరిస్తూ వెలుగుతుండటం మాకు గర్వకారణం. దీనిపై మీకేమైనా అభ్యంతరం ఉందా? యూపీ ఎన్నికల సమయంలోనే బుందేల్‌ఖండ్ దరిద్రం మోదీకి కనిపించి.. బెన్‌క్వెటా ప్రాజెక్టు గుర్తుకు వచ్చిందా? దేశం గురించి మోదీకి చెప్పినా, గోడకు చెప్పినా ఒక్కటే.
ముందస్తు ఎన్నికలు వస్తయని కొందరు బేవకూఫ్ గాళ్లు ప్రచారం చేస్తున్నారు. ఒకడు సోషల్ మీడియాలో పోస్టు పెడితే ముందస్తు ఎన్నికలు పెడ్తమా? 103 మంది ఎమ్మెల్యేలతో రాజకీయ సుస్థిరత ఉంది. వచ్చే ఎన్నికల్లో మేం 95 నుంచి 105 మధ్య సీట్లు సాధిస్తాం. ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తాం. నీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ కుమార్తె పెళ్లి ఖర్చులను ఓ బినామీ కంపెనీ ద్వారా ప్రముఖ నిర్మాణ సంస్థ చెల్లించిందంటూ ఓ న్యూస్ పోర్టల్‌లో కథనం వచ్చిందని ఓ మీడియా ప్రతినిధి ప్రస్తావించగా.. అదేమీ తన దృష్టికి రాలేదని సీఎం కేసీఆర్ బదులిచ్చారు. కుక్కలు ఏదో మొరిగితే సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
బట్టలు మార్చే ట్రిక్కులతో బాగుపడుతుందా?
140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే ప్రధాని నీళ్లలో విమానం దిగి ఏదో పీకి పడేసిన అని చెప్తుండు. బెంగాల్‌లో ఎన్నికలొస్తే ఠాగూర్‌లా వేషం, తమిళనాడు ఎన్నికలొస్తే లుంగీ కట్టడం వంటి బట్టలు మార్చే ట్రిక్కులతో దేశం బాగుపడుతుందా? రాజ్యాంగం కేంద్రం, రాష్ట్రాలకు విడిగా, ఉమ్మడిగా అధికారాలు ఇచ్చినా.. కాంగ్రెస్, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు లాక్కున్నాయి. వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ వంటి ప్రతిపాదనలతో రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోంది. రాష్ట్రానికి వచ్చే ప్రధానికి ఒక ముఖ్యమంత్రిగా స్వాగతం పలుకుతా. కానీ నా అభిప్రాయాలను హెలికాప్టర్‌లో కూర్చుని ప్రధానితో కూడా చెప్పగలను. నేను కేసీఆర్‌ను.. వెనక్కి తగ్గే రకం కాదు.
కేసీఆర్‌ను జైల్లో వేస్తరా?
కేసీఆర్‌ను జైల్లో వేస్తామనే చిల్లరగాళ్లు అనేక రకాలుగా ఉంటారు. సోషల్ మీడియా హడావుడి, హంగామా తప్ప రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు సరైన ప్రతిపక్షం లేదు. సోషల్‌మీడియా కాదు.. క్షుద్ర విద్య. దాని అంతు చూస్తాం. సోషల్ మీడియా పేరిట సొల్లు పురాణం కుమ్మరిస్తే ఇకపై చూస్తూ ఊరుకోం. విరిచి పోయిలో పెడతాం.
ప్రపంచ నేతలతో మాట్లాడుతా..
టీఆర్‌ఎస్ పుట్టిన తర్వాత చంద్రబాబు, బీజేపీ, కమ్యూనిస్టులతోపాటు అందరిచేతా జైతెలంగాణ అనిపించాం. రేపు కూడా కలిసి వచ్చే పార్టీలు, ప్రజలు కదలివస్తారు. డీఎంకే, ఆర్జేడీనే కాదు, ప్రపంచ నేతలతో కూడా మాట్లాడుతా. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో మాట్లాడా. రెండు మూడు రోజుల్లో ముంబై వెళ్లి నా ఆలోచనను ఆయన ముందు పెడతా.
మోదీ సీఎంగా చేసి పీఎం అయ్యారు
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటూనే మోదీ ప్రధాని అయ్యారు. నేను కూడా పార్లమెంటుకు పోటీ చేశాను. ఏదీ అసాధ్యం కాదు. అమెరికా కంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే యువశక్తి, వనరులు భారత్‌కు ఉన్నాయి. వాటిని గరిష్టంగా నియోగించుకుని నా శక్తిమేర కృషి చేస్తా.
– సీఎం కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment