అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు సూచన
మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలు, ఎంపీ అభ్యర్థులతో జూమ్ సమావేశం
సాక్షి, హైదరాబాద్: కౌంటింగ్ రోజున ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు, కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం ఎ.రేవంత్‌రెడ్డి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా ఉండవద్దని, పోటాపోటీగా ఉంటాయని భావిస్తున్న చోట్ల మరింత అప్రమత్తంగా ఉండి కౌంటింగ్ పూర్తయ్యేంతవరకు కేంద్రాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు.
నేడు లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సోమవారం సీఎం రేవంత్ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఇంచార్జి మంత్రులు, ఏఐసీసీ కార్యదర్శులతో జూమ్ ద్వారా సమావేశమయ్యారు. సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్‌మున్షీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా పాల్గొన్నారు.
నిబద్ధత ఉన్న కార్యకర్తలనే ఏజెంట్లుగా
జూమ్ సమావేశంలో భాగంగా రేవంత్ మాట్లాడు తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నిబద్ధత కల కార్యకర్తలను మాత్రమే ఏజెంట్లుగా పంపాలని, సీ నియర్ నేతలను కూడా కౌంటింగ్ కేంద్రాల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. పోలైన ఓట్లతో 17సీ లిస్ట్ సరిపోలాలని, ఈవీఎంలో లెక్కించిన ఓట్లతో 17సీ లిస్టులోని ఓట్లు సరిపోలకపోతే వెంటనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అన్ని విషయాలపై అవగాహన ఉన్న వారిని ఏజెంట్లు పంపేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఏజెంట్లంతా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు అక్కడే ఉండేలా చూడాలని ఎంపీ అభ్యర్థులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment