సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన కేబినెట్‌ను సామాజిక కోణంలో ఏర్చికూర్చినట్టు స్పష్టమవు తోంది. సీనియార్టీ ప్రాతిపదికతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన నేతలతో తొలిదఫా మంత్రివర్గాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేశారు. కొత్త కేబినెట్‌లో దళిత వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్కకు మాత్రమే డిప్యూటీ సీఎం హోదా కల్పించారు.
కనీసం ఇద్దరికి ఈ హోదా వస్తుందనే ప్రచారం జరిగినప్పటికీ రేవంత్‌రెడ్డితో పాటు సీఎం పదవి కోసం పోటీ పడిన భట్టికి మాత్రమే ఈ హోదా లభించడం గమనార్హం.ఇక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో సీఎంతో కలిపి నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు కేబినెట్‌లో అవకాశం లభించినట్టైంది.
కొండా సురేఖ (పద్మశాలి), పొన్నం ప్రభాకర్ (గౌడ్) లను బీసీ వర్గాల నుంచి ఎంపిక చేయగా, దళిత వర్గాల నుంచి దామోదర రాజనర్సింహకు కూడా అవకాశం ఇచ్చారు. ఇక దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (బ్రాహ్మణ), తుమ్మల నాగేశ్వర రావు (కమ్మ), జూపల్లి కృష్ణారావు (వెలమ), ధనసరి అనసూయ (ఎస్టీ)లకు మంత్రిమండలిలో స్థానం లభించింది. మొత్తం మీద అగ్రవర్ణాలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మొత్తం 12 మందితో తెలంగాణ మంత్రిమండలి కొలువు దీరడం విశేషం. కాగా వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మైనార్టీ వర్గాలకు చెందిన ఒక్కరు కూడా ఈ ఎన్నికల్లో గెలవకపోవడంతో తొలి దఫా కేబినెట్‌లో ఆ వర్గానికి స్థానం లభించలేదు.
నాలుగు జిల్లాలకు నో..
జిల్లాల వారీగా పరిశీలిస్తే రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాలకు గాను 6 జిల్లాల నేతలకు మాత్రమే కేబి నెట్‌లో ప్రాతినిధ్యం లభించింది. ఖమ్మం నుంచి ముగ్గురు, నల్లగొండ నుంచి ఇద్దరు, మహ బూబ్ నగర్ నుంచి సీఎంతో కలిపి ఇద్దరు, కరీంనగర్ నుంచి ఇద్దరు, వరంగల్ నుంచి ఇద్దరు, మెదక్ నుంచి ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు. హైదరా బాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందక పోవడంతో ఆ జిల్లాకు అవకాశం లభించలేదు.
రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలా బాద్ జిల్లాల నుంచి పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారికి తొలి విడతలో అవకాశం ఇవ్వలేదు. కేబి నెట్‌లో మరో 17 మంది మంత్రులుగా ఉండే అవ కాశం ఉండగా ప్రస్తుతం 12 మంది ప్రమాణం చేశారు. ఖాళీగా ఉన్న ఆరు బెర్తులను వీలును బట్టి భర్తీ చేస్తారని, పూర్తిస్థాయి కేబినెట్ కొలువు తీరేలోపు అన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెపుతున్నాయి.
ఫస్ట్ టైమర్స్ నలుగురు..
భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క మొదటిసారి మంత్రులయ్యారు. ఇక రేవంత్‌రెడ్డి కూడా ఇంతకుముందు మంత్రిగా పని చేయకుండానే ఏకంగా సీఎం కావడం గమనార్హం. జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా పని చేసిన ఆయన ఇప్పటివరకు రాష్ట్ర మంత్రి పదవి బాధ్యతలు మాత్రం నిర్వర్తించలేదు. ఇక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన భట్టి ఆంధ్రాబ్యాంక్ డైరెక్టర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్, సీఎల్పీ నేత పదవుల్లో పనిచేశారు. ఒక్కసారి కూడా మంత్రి కాకుండానే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. పొంగులేటి, పొన్నం ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం కూడా తొలిసారే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment