![Telangana Congress Crisis Priyanka Gandhi To Meet Leaders - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/20/priyanka-gandhi.jpg.webp?itok=l7-FXNDO)
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పీసీసీలో విభేదాల పరిష్కారానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ రంగంలోకి దిగనున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ సీనియర్ల మధ్య విభేదాల పరిష్కారం దిశగా నేతల మధ్య సమన్వయం కోసం వారితో చర్చించనున్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిశాక ఈ నెల 23 తర్వాత ఈ భేటీ ఉంటుందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.
పీసీసీ కమిటీలపై సీనియర్లు బహిరంగంగానే విమర్శలు చేయడం, పీసీసీ కమిటీ సమావేశాలకు హాజరు కాకపోవడం తదితర అంశాలపై ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్ జావెద్, రోహిత్ చౌదరి ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకలకు సమాచారం పంపారు. ఈ వివాదం మరింత ముదరకముందే నష్ట నివారణ చర్యలకై నదీమ్‌ను ఏఐసీసీ రంగంలోకి దించినా అది ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.
కమిటీ భేటీలకు రావాలని కోరినా సీనియర్లు ఎవరూ స్పందించకుండా భేటీకి డుమ్మాకొట్టారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలను ప్రియాంకాగాంధీకి అప్‌డేట్ చేశారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచే అవకాశాలకు తావివ్వొద్దని, కొద్దిరోజులు అంతా మౌనం పాటించేలా చూడాలని ఆమె కోరినట్లుగా తెలుస్తోంది. కాగా పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే అసమ్మతి అంశంపై భేటీలు నిర్వహించాలని అటు ఖర్గే, ఇటు ప్రియాంకలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అవసరాన్ని బట్టి నేరుగా హైదరాబాద్‌కే వెళ్లి పీసీసీ, సీనియర్లతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ప్రియాంక ఈ విషయమై మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడినట్లు చెబుతున్నా, ఉత్తమ్ సన్నిహితులు మాత్రం కొట్టిపారేశారు. ప్రియాంక నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని వారు స్పష్టం చేశారు.
చదవండి: రేవంత్‌ను విమర్శిస్తే ఊరుకోం
Comments
Please login to add a commentAdd a comment