సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో రచ్చ తారాస్థాయికి చేరింది. ఆదివారం పొద్దంతా పోటాపోటీ భేటీలు, ప్రెస్‌మీట్లు, విమర్శలతో హైడ్రామా నడిచింది. పార్టీ సీనియర్లు కొందరు విధేయుల ఫోరం పేరుతో భేటీ కావడం.. సమావేశం కావొద్దంటూ అధిష్టానం నుంచి ఒత్తిడి వచ్చినా కొనసాగించడం, ఈ భేటీకి కౌంటర్‌గా గాంధీభవన్‌లో కొందరు అధికార ప్రతినిధుల ప్రెస్‌మీట్.. పార్టీ గురించి బయట మాట్లాడేవారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడం.. తర్వాత వారే సీనియర్ల సమావేశానికి వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించడం.. సీనియర్లు నిరాకరించడం.. వంటి పరిణామాలు రోజంతా చర్చనీయాంశంగా మారాయి. విధేయుల ఫోరం సమావేశానికి వెళ్లిన నేతలు కొందరే అయినా.. ఆ భేటీ అనంతరం సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత వేడి పుట్టించాయి.
పార్టీ బలోపేతం కోసమంటూ..
రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంపై చర్చించేందుకంటూ.. ‘కాంగ్రెస్ విధేయుల ఫోరం’పేరిట కొందరు పార్టీ సీనియర్లు ఓ ప్రైవేటు హోటల్‌లో సమావేశమయ్యారు. వేదికపై మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. సోనియా, రాహుల్, ప్రియాంక ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీని కట్టారు. మాజీ ఎంపీ వీహెచ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, కమలాకర్‌రావు, శ్యాంమోహన్ తదితర నేతలు దీనికి హాజరయ్యారు. అయితే ఈ సమావేశం విషయం తెలుసుకున్న అధిష్టానం పెద్దలు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. పార్టీలో సమస్యలుంటే అంతర్గత వేదికలపై మాట్లాడుకుందామని, ఇలా ప్రత్యేకంగా సమావేశాలు పెట్టవద్దంటూ ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు సీనియర్ నేతలకు ఫోన్ చేసినట్టు తెలిసింది. అయితే తమది అసమ్మతి సమావేశం ఏమీ కాదని, రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తుపై చర్చించేందుకే భేటీ అవుతున్నామని సీనియర్లు చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలోనే యథాతథంగా సమావేశం కొనసాగించి, పలు అంశాలపై చర్చించారు.
అశోకా హోటల్‌లో భేటీ అయిన వీహెచ్,జగ్గారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి
ఎవరైనా సరే.. సస్పెండ్ చేయాలి..
ఇటు పార్టీ సీనియర్ల భేటీ జరుగుతున్న సమయంలోనే.. మరోవైపు గాంధీభవన్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, ఈరవత్రి అనిల్, మానవతారాయ్‌లు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ బలోపేతం అవుతోందని.. ఇలాంటి తరుణంలో సీనియర్ల పేరిట సమావేశాలు ఏర్పాటు చేయడం సరికాదని, దీనివల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు పదవులు అనుభవించిన వారే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎలాగని ప్రశ్నించారు. వీహెచ్, జగ్గారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వంటి కొందరు నాయకులు రేవంత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని.. పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న వారికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని కోరారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారు ఎంతటి వారైనా సరే.. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వీహెచ్ ఒక ఎమ్మెల్సీని వెంటబెట్టుకుని రహస్యంగా మంత్రి హరీశ్‌రావును కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కోవర్టులకు బుద్ధి చెప్పేంతవరకు పోరాటం చేస్తామని వ్యాఖ్యానించారు.
వ్యక్తిగత పనిమీద వెళ్లా..!
వీహెచ్ హరీశ్‌రావు ఇంటికి వెళ్లి ఎందుకు కలిశారన్న దానిపై సీనియర్ల సమావేశంలోనూ చర్చకు వచ్చినట్టు సమాచారం. వైద్యశాఖలో పనిచేస్తున్న తన కుమార్తె విషయంగా మాట్లాడానని పార్టీ నేతలతో వీహెచ్ చెప్పినట్టు తెలిసింది. దీనిపై మీడియా కూడా ప్రశ్నించగా.. వ్యక్తిగత పనిమీద హరీశ్‌ను కలిశానే తప్ప వేరే ఉద్దేశం లేదని వీహెచ్ చెప్పారు. తర్వాత ఈ విషయంపై జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సీఎం, మంత్రులను ఇతర పార్టీల నేతలు కలిసే సంప్రదాయం ఇప్పుడే కొత్తగా వచ్చిందేమీ కాదన్నారు. వ్యక్తిగత పనుల మీద తాము కూడా చాలా మందిని కలుస్తుంటామని, అలాంటప్పుడు వీహెచ్ హరీశ్‌రావును కలవడంలో తప్పేంటని ప్రశ్నించారు.
చర్యలా.. రాజీలా..?
రేవంత్ వర్సెస్ సీనియర్లుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న జగడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే దానిపై ఆ పార్టీ కేడర్‌లో చర్చ జరుగుతోంది. రేవంత్ దూకుడుగా ముందుకెళ్తుండటం, ఆయన వన్ మ్యాన్ షో చేస్తున్నారని, పార్టీ లైన్‌లో లేడని సీనియర్లు విమర్శిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై అధిష్టానం కూడా దృష్టి సారించింది. తమ సూచనను కాదని భేటీ అయిన సీనియర్ల విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తమ వాదన వివరించేందుకు ఢిల్లీ వెళ్లాలని ‘విధేయుల ఫోరం’నేతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? సీనియర్లు తగ్గుతారా? రేవంత్ వర్గం రాజీకి వస్తుందా? కాంగ్రెస్ అడుగులు ఎటువ వైపు అన్నది ఇటు కాంగ్రెస్ పార్టీలో అటు రాష్ట్ర రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.
పార్టీ కష్టకాలంలో ఉంది: మర్రి శశిధర్‌రెడ్డి
గత రెండు ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఎన్నికలు చాలా కీలకమని, భవిష్యత్తులో పార్టీకి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే అంశంపై తాము చర్చించామని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ల భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము అసమ్మతి వాదులం కాదని, ఎవరికీ వ్యతిరేకంగా సమావేశం నిర్వహించలేదని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోయామని, హుజూరాబాద్‌లో పరాభవం జరిగిందని.. భవిష్యత్తులో అలా జరగకుండా ఏం చేయాలన్న దానిపై సీనియర్లుగా మాట్లాడుకున్నామని వివరించారు. పార్టీ కష్టకాలంలో ఉందని, పొరపాట్లను సరిదిద్దుకోవాలన్నదే తమ అభిప్రాయమని చెప్పారు. పార్టీ ఎవరిని సీఎం చేసినా, ఏ పదవి ఇచ్చినా తమకు సమ్మతమేనని.. అధిష్టానం తీసుకునే నిర్ణయంపై నమ్మకముందని వ్యాఖ్యానించారు.
రేవంత్ పార్టీని చెడగొడుతున్నాడు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీ లైన్‌లో లేడని, ఆయన పార్టీని చెడగొడుతున్నాడని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. తాము కాంగ్రెస్‌కు, సోనియా, రాహుల్, ప్రియాంకలకు వ్యతిరేకం కాదని.. తాము పార్టీ లైన్‌లోనే ఉన్నామని చెప్పారు. ఆదివారం సీనియర్ల భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రేవంత్ పర్సనల్ షో చేస్తున్నాడు కనుకనే నేనూ పర్సనల్ షో చేస్తున్నా. అంతా ఆయనొక్కడే అన్నట్టు రేవంత్ భజన మండలి మాట్లాడుతోంది. మేమంతా లేకుండా రేవంత్ ఒక్కడే పార్టీని అధికారంలోకి తెస్తాడా? నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.
రేవంత్ అక్కడ నాపై తన మనిషిని నిలబెట్టి గెలిపించుకోవాలి. నేను స్వతంత్రంగా పోటీ చేస్తా. నేను గెలిస్తే హీరోని. రేవంత్ గెలిస్తే ఆయన హీరో. ఇక ఆయన ఎలా చెప్తే అలా. అదే రేవంత్ ఓడిపోతే ఏం చేస్తాడో సవాల్ చేయమనండి. ఇద్దరం ఓడిపోతే ఇద్దరం జీరోలమవుతాం. గెలిచిన వాడు హీరో అవుతాడు’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రేవంత్ ఒక్కడే అధికారంలోకి తెచ్చేందుకు ఇదేమైనా పిల్లల ఆటనా అని ప్రశ్నించారు. షోకాజ్ నోటీసులిచ్చి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తానేంటో చూపిస్తానని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment