కాంగ్రెస్‌లో టెన్షన్‌.. టెన్షన్‌.. తెలంగాణలో బీజేపీ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? | Telangana Congress Loss With MLA Komatireddy Rajagopal Reddy Resignation | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో టెన్షన్‌.. టెన్షన్‌.. తెలంగాణలో బీజేపీ గేమ్‌ ప్లాన్‌ ఏంటి?

Published Thu, Aug 4 2022 1:03 PM | Last Updated on Thu, Aug 4 2022 3:02 PM

Telangana Congress Loss With MLA Komatireddy Rajagopal Reddy Resignation  - Sakshi

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం ఆ పార్టీకి  పెద్ద దెబ్బే అని చెప్పాలి. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఇది బాగా నష్టం చేసే పరిణామంగా అనుకోవాలి. దానికి తోడు రాజగోపాలరెడ్డి, రేవంత్‌ల మధ్య సాగిన మాటల యుద్దం కూడా కాంగ్రెస్‌కు కొంత నష్టం చేయవచ్చు. కోమటిరెడ్డి బ్రదర్స్‌గా పేరొందిన వెంకటరెడ్డి, రాజగోపాలరెడ్డిలు కాంగ్రెస్‌లో బలమైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా నల్లగొండ రాజకీయాలలో తమకంటూ ఒక ఒక పాత్రను సృష్టించుకోగలిగారు. 1999లో వెంకటరెడ్డి యువజన కాంగ్రెస్ ద్వారా ఆనాడు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్.రాజశేఖరరెడ్డికి దగ్గర అయ్యారు. అప్పటి నుంచి వైఎస్ సన్నిహితుడుగా ఉంటూ వచ్చినా, వైఎస్ మరణం తర్వాత తెలంగాణ ఉద్యమంలో మమేకం అయ్యారు.
చదవండి: అయోమయంలో కాంగ్రెస్‌.. రేవంత్‌ స్ట్రాటజీ వర్కవుట్‌ అవుతుందా?

టీఆర్ఎస్ నేత కేటీఆర్ తదితరులతో కలిసి విద్యుత్ బోర్డు కార్యాలయం వద్ద ధర్నా చేయడం, మంత్రి పదవిని వదలుకోవడం వంటి వాటి ద్వారా తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు పొందారు. నాలుగు సార్లు అసెంబ్లీకి  ఎన్నికైన వెంకటరెడ్డి గత ఎన్నికలలో నల్లగొండ నుంచి పోటీ చేసి తొలిసారి ఓటమి చెందారు. తదుపరి వచ్చిన లోక్ సభ ఎన్నికలలో భువనగిరి నుంచి పోటీచేసి విజయం సాధించారు.

ఆయన సోదరుడు రాజగోపాలరెడ్డి తొలిసారిగా 2009లో భువనగిరి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 2014లో ఆయన ఓటమి చెందినా, తదుపరి శాసనమండలికి ఎన్నిక కాగలిగారు. 2019లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచి సత్తా చాటుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటే అలా జరగకపోగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్‌లో విలీనం అవడం ఆ పార్టీకి అవమానంగా మారింది. ప్రజలు నమ్మలేని పరిస్థితి నెలకొంది. మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబంగా ఉన్న కోమటిరెడ్డి సోదరులలో ఒకరు ఇప్పుడు బీజేపీలోకి వెళ్లడం కాంగ్రెస్ పరిస్థితిని మరింత దిగజార్చుతుందనడంలో అతిశయోక్తి లేదు. వీరిద్దరూ ఫైర్ బ్రాండ్‌గా పేరొందారు. జిల్లాలో కాని, రాష్ట్ర స్థాయిలో కాని సొంత పార్టీవారిపైన అయినా, ప్రత్యర్ది పార్టీపైన అయినా, పదునైన మాటలతో విమర్శలు కురిపించగలరు.

కోమటిరెడ్డి సోదరులు పీసీసీని తమకు అప్పగించాలని అధిష్టానాన్ని గతంలో కోరారు. కాని వైఎస్ సన్నిహితులు అన్న కారణంగానో, మరెందువల్లో కాని వారి వైపు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు మొగ్గు చూపలేదు. పైగా తెలుగుదేశం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి విశేష ప్రాధాన్యత ఇచ్చి, ఆ తర్వాత పీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టడం వీరికి జీర్ణం కాని పరిస్థితి అయింది. దాంతో వెంకటరెడ్డి ఏకంగా పార్టీ ఇన్‌చార్జీ మాణిక్యం ఠాకూర్‌కు కోట్ల రూపాయలు ఇచ్చి రేవంత్ పీసీసీ పదవి పొందారని ఆరోపించడం తీవ్ర కలకలం రేగింది. అయినా ఆ తర్వాత సర్దుకుని, స్టార్ కాంపెయినర్ హోదాతో సరిపెట్టుకున్నారు.

కాగా ఆయన సోదరుడు రాజగోపాలరెడ్డి రెండేళ్ల నుంచే బీజేపీ పాట అందుకున్నారు. టీఆర్ఎస్‌ను ఓడించే శక్తి బీజేపీకే ఉందని, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా లే శక్తిమంతమైన నేతలని అనడం ఆరంభించారు. కాని ఆయన చాలా కాలం ఊగిసలాటలో ఉన్నారనే చెప్పాలి. ఒకసారి కాంగ్రెస్‌ను వీడతానని, మరోసారి ఇక్కడే ఉంటానని అంటూ కాలం గడిపారు. కాని ఇటీవలి కాలంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ స్పర్ద బాగా పెరిగిపోవడంతో బీజేపీ ఇక తన గేమ్ ఆరంభించింది. బీజేపీ వైపు మొగ్గుచూపుతున్న రాజగోపాలరెడ్డిని పార్టీలోకి రప్పించడానికి ఎత్తులు వేసింది.

స్వయంగా అమిత్ షానే పార్లమెంటు హాలులో ఈయనతో మంతనాలు జరపడమే ఇందుకు నిదర్శనం. రాజగోపాలరెడ్డి రాజీనామా చేయాలని అప్పుడే షా సూచించారని చెబుతారు. ఆ తర్వాత దానిని ఒక ప్రణాళిక ప్రకారం అమలు చేయడానికి రాజగోపాలరెడ్డి పావులు కదిపారు. ముందుగా తనతో ఉన్న కాంగ్రెస్ మునుగోడు స్థానిక నేతలను బీజేపీలోకి తీసుకు వెళ్లడానికి గాను సంప్రదింపులు జరిపారు. తాను ఒక్కడినే పార్టీని వీడినా పెద్ద ఫలితం ఉండదని ఆయనకు తెలుసు. అదే సమయంలో కేసీఆర్ కుటుంబ పాలనకు నిరసనగా పార్టీని వీడుతున్నట్లు, మునుగోడు నియోజకవర్గ అభివృద్దికి ఉప ఎన్నిక ఉపయోగపడుతుందని చెప్పడం ఆరంభించారు.

నియోజకవర్గ అభివృద్ది అనుకుంటే టీఆర్ఎస్ లోనే చేరవచ్చు కదా అన్న విమర్శ కూడా లేకపోలేదు. వీరికి దేశ వ్యాప్తంగా పలు చోట్ల కాంట్రాక్టులు ఉన్నాయి. బీజేపీలో చేరితే వ్యాపార పరంగా ఉపయోగం ఉంటుందని అనుకుని ఉండవచ్చన్నది ఎక్కువ మంది భావన. దాని సంగతి ఎలా ఉన్నా, కాంగ్రెస్‌లో ఉండడం వల్ల తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న అభిప్రాయానికి ఆయన వచ్చేశారు. అందులోను రేవంత్‌కు అధ్యక్ష పదవి అప్పగించడం ఆయనకు సుతరాము ఇష్టం లేదు. అందువల్లే చాలా కాలంగా కాంగ్రెస్ యాక్టివిటిలో పెద్దగా కనిపించడం లేదు. రేవంత్ టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉంటారని ఇప్పటికీ చాలా మంది నమ్ముతుంటారు.

అందుకే రేవంత్‌ను తెలంగాణ చంద్రబాబుగా కోమటిరెడ్డి పోల్చారు. అది వేరే సంగతి. రాజగోపాలరెడ్డిని బుజ్జగించడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది కాని విఫలం అయింది. ఆ తర్వాత రేవంత్ ఈయనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా వేసే బిస్కట్ల కోసం రాజగోపాలరెడ్డి ఆశపడ్డారని, సోనియాగాంధీకి వెన్నుపోటు పొడిచారని ఆయన విమర్శించారు. నిజానికి రేవంత్ ఇలాంటి వ్యాఖ్య చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఆయన మొదట ఆర్ఎస్ఎస్ కార్యకర్త. తదుపరి టిఆర్ఎస్‌లో యాక్టివ్‌గా ఉండేవారు. ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు. చంద్రబాబుకు సన్నిహితుడుగా పేరొందారు. చివరికి చంద్రబాబు తరపున నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి వెళ్లి తెలంగాణ ఏసీబీకి పట్టుబడి జైలుకు వెళ్లారు.

ఆయనపై ఈ నెగిటివ్ మార్క్ ఉన్నా కాంగ్రెస్ హై కమాండ్ ఆయనకు పీసీసీ బాధ్యత అప్పగించింది. రేవంత్ తన మాటల ఘాటుతో కాంగ్రెస్ శ్రేణులను కొంతవరకు ఆకర్షించిన మాట నిజం. కాని కాంగ్రెస్ సీనియర్లు ఆయన తీరుతో బహిరంగంగానే విభేధించడం జరుగుతోంది. ఇదంతా కాంగ్రెస్‌కు చికాకుగానే ఉంది. ఎలాగైనా వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలన్న లక్ష్యంతో పార్టీ అధినాయకత్వం ఉన్నప్పటికీ ఇలా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో విలీనం అయితే పార్టీ చేష్టలుడిగి చూస్తుండిపోయింది తప్ప, గట్టిగా పోరాటం చేయలేకపోయింది. రేవంత్ ఆయా కార్యక్రమాలను జోష్ గా నడపాలని కృషి చేస్తున్నా, ఎటో వైపు నుంచి తలనొప్పి తప్పడం లేదు.

టీఆర్ఎస్ తర్వాత తెలంగాణలో బలమైన పార్టీ కాంగ్రెసే. కాని తాజా పరిణామాలతో టీఆర్ఎస్, బీజేపీల మధ్య కాంగ్రెస్ నలిగిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. దుబ్బాక లో మూడో స్థానానికి పరిమితం కావడం, హుజూరాబాద్ లో కేవలం మూడువేల ఓట్లే రావడం, గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీకి 48 డివిజన్లు వస్తే కాంగ్రెస్‌కు కేవలం రెండే దక్కడం బాగా నష్టం చేసింది. ఇప్పుడు మునుగోడులో కాంగ్రెస్ ఉనికిని కాపాడుకోవడమే కష్టంగా మారింది. నిజంగానే రాజగోపాలరెడ్డి వెంటే మెజార్టీ కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరిపోతే  కాంగ్రెస్కు సరైన అభ్యర్ది దొరకడం కూడా కష్టమే అవుతుంది. రాజగోపాలరెడ్డి సోదరుడు వెంకటరెడ్డి ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉన్నా, ఈ పరిణామాలలో ఆయన జోక్యం చేసుకోవడం కష్టమే అవుతుంది.

తాము చెప్పినట్లు కాంగ్రెస్ అధిష్టానం విననప్పుడు తాము ఎందుకు పూసుకోవాలని ఆయన అనుకునే అవకాశం ఉంటుంది. అప్పుడే ఇక్కడ కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయిందన్న కథనాలు మీడియాలో వస్తున్నాయి. వ్యక్తిగా రాజగోపాలరెడ్డికి ఇది అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నిక అవుతుంది. బీజేపీకి ఈయన మరో ట్రంప్ కార్డు అవుతారు. బీజేపీ ఆడుతున్న గేమ్ లో ఈయన గెలిస్తే తెలంగాణ రాజకీయాలను బాగా ప్రభావితం చేస్తుందన్నది వాస్తవం. కాంగ్రెస్ ను ముందుగా బలహీనం చేయడం ద్వారా టీఆర్ఎస్‌ను ఎదుర్కోవాలన్న బీజేపీ వ్యూహం ఫలిస్తున్నట్లవుతుంది. ఒకవేళ ఓడిపోయి రెండో స్థానం సాధించినా బీజేపీకి పెద్దగా నష్టం ఏమీ ఉండదు. కాంగ్రెస్ ను మూడో స్థానానికి నెట్టగలిగితే అది కూడా వారికి లాభమే అవుతుంది.

కాంగ్రెస్ గెలిస్తే మాత్రం రాజగోపాలరెడ్డికి పెద్ద దెబ్బ అవుతుంది. ఇప్పటికైతే ఆ పరిస్థితి లేదని ఎక్కువ మంది నమ్ముతున్నారు. టీఆర్ఎస్‌కు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఇది కీలకమైన ఎన్నిక అవుతుంది. టీఆర్ఎస్ గెలవకపోతే ఆయన బీజేపీ నుంచి మరిన్ని ఇక్కట్లు ఎదుర్కోవలసి వస్తుంది. టీఆర్ఎస్ గెలిస్తే మాత్రం అది ఆ పార్టీకి వచ్చే ఎన్నికల నేపథ్యంలో మంచి ఉత్సాహం ఇస్తుంది. కాంగ్రెస్ ఉనికికి ఇది పరీక్ష అయితే టీఆర్ఎస్‌కు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం అవుతుంది. బీజేపీకి మాత్రం లాటరీ వంటిదే. ఓడిపోతే కొంత అప్రతిష్ట వచ్చినా వారికి పెద్దగా పోయేది ఏమీ ఉండదు.

కొండకు వెంట్రుక కట్టినట్లుగా గెలిస్తే కొండ వచ్చినట్లు..లేకుంటే వెంట్రుక పోయినట్లే బీజేపీ అనుకోవచ్చు. త్రిపురలో కాంగ్రెస్‌ను మొత్తం ఖాళీ చేసి అధికారంలోకి వచ్చినట్లు, పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్, సీపీఎంలను సున్నా చేసి, తాను ప్రధాన ప్రతిపక్షంగా అవతరించినట్లుగా బీజేపీ చేస్తున్న వ్యూహరచన తెలంగాణలో ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. ఈ గేమ్ లో రాజగోపాలరెడ్డి కీలకమైన వ్యక్తిగా మారారన్నది వాస్తవం.

-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement