కాంగ్రెస్ అంటేనే ఓ విచిత్రమైన పార్టీ. అక్కడ ఎవరి గోల వారిదే. వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న పార్టీ స్వయంకృతాపరాధాలతోనే నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. తెలంగాణలో కూడా అదే బాటలో నడుస్తోంది. రెండున్నరేళ్ళ క్రితం వచ్చిన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ స్థానంలో మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత మాణిక్‌రావు ఠాక్రేకు తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్‌లో ఇన్‌చార్జ్‌లను అవసరమైతే మూడేళ్లకో సారి మార్చుతారు. గతంలో పలువురు సీనియర్ నేతలు రెండు మూడు దఫాలుగా కూడా కొనసాగారు. కాని ఠాగూర్‌ను రెండున్నరేళ్ళకు ఎందుకు సాగనంపారు? ఠాగూర్ రాష్ట్రంలోని సీనియర్లతో వ్యవహరించిన తీరే ఆయన్ను పక్కన పెట్టారని గాంధీభవన్‌లో బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.
మాణిక్కం ఎక్కడ తిరగబడ్డారు?
తెలంగాణ ఇన్‌చార్జ్‌గా వచ్చిన ఠాగూర్ మొదట్లో మంచి క్రేజ్ సంపాదించారు. చిన్న వయస్సులోనే కీలక రాష్ట్రానికి ఇంచార్జ్ గా బాధ్యతలు రావడంతో మొదట్లో ఉత్సాహంగా పని చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో శ్రేణులందరినీ మోహరింప చేసి గౌరవప్రదమైన ఓట్లు సాధించేలా చూశారు. ఆ తర్వాత పీసీసీ చీఫ్ మార్పు విషయంలో సీనియర్లతో మొదలైన గ్యాప్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని హైకమాండ్ నియమించింది. పీసీసీ సీటు కోసం సీనియర్లు చాలా మంది ప్రయత్నించారు. వారందరినీ కాదని తెలుగుదేశం నుంచి వచ్చిన రేవంత్‌కు గాంధీభవన్ అప్పగించడంతో ఠాగూర్ పెద్ద అపవాదును మూట కట్టుకున్నారు.
సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఠాగూర్ పీసీసీ చీఫ్ పదవిని 40 కోట్లకు అమ్ముకున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత రేవంత్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై అనేకసార్లు మాణిక్కం ఠాగూర్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోగా..ఫిర్యాదు చేసినవారిని ఎగతాళి చేసేవారట. దీంతో సీనియర్లు క్రమంగా ఠాగూర్‌కు దూరమయ్యారు. ఆయన్ను తొలగించాలని ఎప్పటినుంచో హైకమాండ్‌ను డిమాండ్ చేస్తున్నారు.
ఇంతకీ రేవంత్ రూటు ఏంటీ?
సీనియర్లతో పని చేయించుకునే విషయంలో పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి విఫలం కావడం.. నిరంతరం గ్రూపు తగాదాలతో రెండేళ్ళుగా పార్టీ బాగా డ్యామేజ్ అయింది. ఈ పరిస్థితులలో పార్టీని గాడిన పెట్టాల్సిన ఇంచార్జ్ ఠాగూర్ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయనపై ఉన్న ప్రధానమైన ఫిర్యాదు. సీనియర్లను పట్టించుకోవడం మానేయడమే గాకుండా..కొత్త కమిటీల ఏర్పాటు సందర్భంగా కూడా సీనియర్ల ఆగ్రహానికి ఠాగూర్ గురి కావాల్సి వచ్చింది. పరిస్థితి తీవ్రతను గమనించిన తర్వాత పార్టీ హైకమాండ్ రంగంలోకి వచ్చి.. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను హైదరాబాద్ పంపించింది.
పీసీసీ చీఫ్‌తోను..సీనియర్లతోనూ చర్చించిన దిగ్విజయ్ సింగ్ ఢిల్లీ వెళ్ళి హైకమాండ్‌కు నివేదిక సమర్పించారు. డిగ్గీ రాజా ఇచ్చిన రిపోర్టు ఠాగూర్‌కు వ్యతిరేకంగానే ఉన్నట్లు సమాచారం. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఠాగూర్ సైతం తెలంగాణ బాధ్యతల నుంచి తనను తప్పించమని పార్టీ అధిష్టానాన్ని వేడుకున్నారట.
డిగ్గీ రాజా నివేదికలో ఏముంది?
దిగ్విజయ్ సింగ్ నివేదిక పరిశీలించిన తర్వాత ఢిల్లీ పెద్దలు ఠాగూర్‌ను తప్పించడానికి నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద తెలంగాణ సీనియర్ల దెబ్బకు ఠాగూర్ ఇక్కడి నుంచి సర్దుకోవాల్సి వచ్చింది. అయితే ఠాగూర్ నుంచి కొత్త గా వచ్చిన ఇంఛార్జ్ ఠాక్రే చాలా నేర్చుకోవాల్సిఉంది. సీనియర్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడంతో పాటు..అందరినీ ఏకతాటిపై నడిపించడం కూడా కొత్త ఇన్‌చార్జ్ ముందున్న సవాళ్ళు. కొత్త ఇన్‌చార్జ్ నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంతవరకు బాగుపడుతుందో చూడాలి.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment