సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా.. పార్టీ కీలక నేతలతో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ ముగిసింది. ఓ హోటల్‌లో ఈ సమావేశం జరగ్గా.. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్‌తో తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్‌కుమార్‌లు గంటన్నరకుపైగా చర్చలు జరిపారు.
స్క్రీనింగ్ కమిటీ మొదటిసారి భేటీ అయ్యింది. స్క్రీనింగ్ కమిటీలో సీనియర్ల సూచనలు తీసుకున్నాం అని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ థాక్రే తెలిపారు. సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆపై రూపొందించిన నివేదికతో మురళీధరన్ ఈ రాత్రికే ఢిల్లీకి బయల్దేరతారని సమాచారం.
ఇదిలా ఉంటే.. దరఖాస్తుల స్వీకరణ అనంతరం సెప్టెంబర్ 4వ తేదీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా కసరత్తు తీవ్రంగానే సాగుతోంది. ప్రదేశ్ ఎన్నికల కమిటీ అభిప్రాయాలతో పాటు, ఆపై పీఈసీలో లేని సభ్యులు, మాజీ కార్యదర్శులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతోనూ వన్ టు వన్ భేటీ నిర్వహించారు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్. వాళ్ల నుంచి అభిప్రాయ సేకరణ ద్వారా చివరకు ఒక్కో నియోజకవర్గానికి ప్రయారిటీల వారిగా 1 నుంచి మూడు పేర్లను స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
స్క్రీనింగ్ కమిటీ రూపొందించిన నివేదికను తీసుకుని మురళీధరన్ ఈ రాత్రికే ఢిల్లీకి పయనం అవుతారు. అంతకుముందు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ కావొచ్చని తెలుస్తోంది. ఇక.. రేపు(సెప్టెంబర్ 7వ తేదీన) సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి ఆ నివేదికను సమర్పిస్తారు. ఆపై అభ్యర్థుల జాబితా ప్రక్రియ ఎంపిక ఓ కొలిక్కి వస్తుంది . అయితే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల కంటే ముందే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటుందా? అనేది అనుమానంగానే మారింది ఇప్పుడు.
నేడు హైదరాబాద్‌కు కేసీ వేణుగోపాల్
పార్టీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నెల 16,17 వ తేదీలలో హైదరాబాద్ లో cwc సమావేశాలు ఉండడంతో కేసి వేణుగోపాల్ సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. Cwc సమావేశాలు జరిగే తాజ్ కృష్ణ హోటల్ తో పాటు.. భారీ బహిరంగ సభ కోసం పీసీసీ చూసిన రెండు స్థలాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం cwc సమావేశాల నేపథ్యంలో.. ఏఐసీసీ గైడ్ లైన్స్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దిశా నిర్దేశం చేస్తారు. ఇదే హోటల్‌లో స్క్రీనింగ్ కమిటీ భేటీ జరుగుతుండడంతో.. కేసీ వేణుగోపాల్ ఆ కమిటీతోనూ భేటీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment