
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) అక్టోబర్ 10న ప్రకటించనున్నట్లు తెలిసింది. అక్టోబర్ మొదటి వారంలో ఈసీ అధికారుల బృందం నిర్వహించే సమీక్షా సమావేశం అనంతరం ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని ఈసీ బృందం అక్టోబర్ 3 నుంచి హైదరాబాద్‌లో పర్యటించనుంది. ఈ క్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమై శాసనసభ ఎన్నికల సన్నద్ధతను సమీక్షించనుంది.
తెలంగాణ గత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ 2018 అక్టోబర్ 6న విడుదల కాగా డిసెంబర్ మొదటి వారంలో పోలింగ్ జరిగింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇదే తరహాలో జరుగుతాయని అందరూ భావిస్తున్నారు.
ఎన్నికల తేదీలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలోని అధికార బీఆర్‌ఎస్ సహా పార్టీలన్నీ తమ సన్నాహాలను ముమ్మరం చేశాయి. ప్రత్యర్థులపై పట్టు సాధించేందుకు బీజేపీ సీనియర్ జాతీయ నేతలను రంగంలోకి దింపాలని యోచిస్తోంది. అక్టోబరులో బీజేపీ ప్రతిరోజూ ఒక భారీ ర్యాలీ నిర్వహిస్తుందని పార్టీ నాయకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment