Assembly election schedule
-
అక్టోబర్ 10న తెలంగాణ ఎన్నికల షెడ్యూల్?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) అక్టోబర్ 10న ప్రకటించనున్నట్లు తెలిసింది. అక్టోబర్ మొదటి వారంలో ఈసీ అధికారుల బృందం నిర్వహించే సమీక్షా సమావేశం అనంతరం ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని ఈసీ బృందం అక్టోబర్ 3 నుంచి హైదరాబాద్‌లో పర్యటించనుంది. ఈ క్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమై శాసనసభ ఎన్నికల సన్నద్ధతను సమీక్షించనుంది. తెలంగాణ గత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ 2018 అక్టోబర్ 6న విడుదల కాగా డిసెంబర్ మొదటి వారంలో పోలింగ్ జరిగింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇదే తరహాలో జరుగుతాయని అందరూ భావిస్తున్నారు. ఎన్నికల తేదీలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్ సహా పార్టీలన్నీ తమ సన్నాహాలను ముమ్మరం చేశాయి. ప్రత్యర్థులపై పట్టు సాధించేందుకు బీజేపీ సీనియర్ జాతీయ నేతలను రంగంలోకి దింపాలని యోచిస్తోంది. అక్టోబరులో బీజేపీ ప్రతిరోజూ ఒక భారీ ర్యాలీ నిర్వహిస్తుందని పార్టీ నాయకులు తెలిపారు. -
సెప్టెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేడి ఊపందుకుంది. ఒకవైపు పార్టీలు రాజకీయ పావులు కదుపుతూనే విమర్శల డోసు పెంచగా.. మరోవైపు కేంద్రం ఎన్నికల సంఘం ఎన్నికల కసరత్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఇవాళ(బుధవారం) ఎన్నికల సంఘానికి చెందిన బృందం తెలంగాణకు రానుంది. సెప్టెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఏర్పాట్ల పర్యవేక్షణకు.. కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణకు రానుంది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నేతృత్వంలోని ఈ బృందం హైదరాబాద్‌లోనే నాలుగు రోజులపాటు ఉండనుంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం భేటీ అయ్యి.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశంపై చర్చించనుంది. ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఈ సమావేశం జరగనుంది. ఇదీ చదవండి: లక్షలోపు రుణమాఫీ ఉత్తమాటేనా? -
కర్నాటక అసెంబ్లీ ఎలక్షన్స్: షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
సాక్షి, ఢిల్లీ: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కర్నాటకలో 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే, ఈ ఎన్నికల్లో దేశంలోనే తొలిసారిగా 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఓట్ ఫ్రమ్ హోం(ఇంటి వద్ద నుంచే ఓటు) సదుపాయం కల్పిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నాటకలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మహిళ, పురుష ఓటర్లు దాదాపు సమానం. 80ఏళ్లు పైబడిన వారు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపారు. వీరి సంఖ్య 12.15 లక్షలుగా ఉన్నట్టు స్పష్టం చేశారు. దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయం కల్పించామన్నారు. గిరిజన ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. 41,312 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. కర్నాటకలో 224 స్థానాలకు గానూ 36 ఎస్సీ, 15 ఎస్టీ, 173 జనరల్ స్థానాలుగా నిర్ణయించినట్టు తెలిపారు. కర్నాటకలో 58,282 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నేటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్టు స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్ ఇదే.. ► ఏప్రిల్ 13న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ► అభ్యర్థుల నామినేషన్ల దాఖలకు ఏప్రిల్ 20 చివరి తేదీ. ► ఏప్రిల్ 21న నామినేషన్ల పరిశీలన. ► ఏప్రిల్ 24వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు తేదీ. ► మే 10న పోలింగ్ జరుగనుంది. ► 13న ఓట్లు లెక్కింపు. -
‘ఏ’ అంటే ఆదివాసీలు
అహ్మదాబాద్: ‘‘నాకు ‘ఏ’ అంటే ఆదివాసీలు. వారి ఆశీస్సులతో గుజరాత్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నా. ఆదివాసీలు నివసించే ప్రాంతాల్లో గతంలో డాక్టర్ల కోసం వెతుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆసుపత్రులు, వైద్య కళాశాలలు ఏర్పాటవుతున్నాయి’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సొంత రాష్ట్రం గుజరాత్‌లోని వల్సాద్ జిల్లా కప్రాడా తాలూకా నానా పోంధా గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాష్ట్రంలో ఆయన ప్రచారంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఆ గుజరాత్, మై బనావ్యూ చే(ఈ గుజరాత్‌ను నేను తయారు చేశా) అనే కొత్త నినాదానికి మోదీ శ్రీకారం చుట్టారు. ప్రసంగం మధ్యలో ప్రజలతో పలుమార్లు ఈ నినాదాన్ని పలికించారు. రెక్కల కష్టంతో గుజరాత్‌ను తాము తయారు చేశామని ప్రజలంతా భావిస్తున్నారని వెల్లడించారు. ప్రతి ఒక్కరి హృదయం నుంచి వస్తున్న ప్రతి శబ్దం ‘ఆ గుజరాత్, మై బనావ్యూ చే’ అని చెబుతోందన్నారు. రాష్ట్రంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు మెజార్టీతో నెగ్గబోతున్నట్లు తనకు సమాచారం అందిందని, పాత రికార్డులను బద్దలు కొట్టడానికే తాను ఇక్కడికి వచ్చానని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ సాధించిన రికార్డుల కంటే భూపేంద్ర పటేల్(గుజరాత్ సీఎం) రికార్డులు బలంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని వివరించారు. రాష్ట్ర ప్రజల కోసం చాలినంత సమయం కేటాయిస్తానన్నారు. రాష్ట్ర ప్రగతి స్ఫూర్తిదాయకం ప్రజాసేవ అనేది గుజరాత్ సంప్రదాయం, సంస్కృతిలో ఒక భాగమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆదివాసీలు, ఇతర వర్గాలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. గుజరాత్ ప్రగతిని స్ఫూర్తిగా తీసుకొని దేశ ప్రగతి కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. తాను ఢిల్లీలో ఉన్నప్పటికీ గుజరాత్ నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటానని తెలిపారు. తన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రులు పనిచేసిన వారంతా అభివృద్ధి కోసం శ్రమించారని ప్రశంసించారు. దుష్టశక్తులకు పరాజయమే సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేవారికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని మోదీ అన్నారు. గుజరాత్‌ను అప్రతిష్టపాలు చేస్తున్న దుష్టశక్తులకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తప్పదని చెప్పారు. అలాంటి శక్తులు రాష్ట్రం నుంచి తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని స్పష్టం చేశారు. -
నిష్పక్షపాతంగానే గుజరాత్ ఎన్నికల షెడ్యూల్
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వందకు వంద శాతం నిష్పక్షపాతంగా విడుదల చేశామని, ఆలస్యం కావడం వెనుక ఎలాంటి ఉద్దేశం లేదని కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. గురువారం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన అనంతరం మీడియా చిట్‌చాట్‌లో ఆయన పాల్గొన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు షెడ్యూల్ అంతా సవ్యంగానే ఉంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు రెండు వారాల గ్యాప్‌లోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాం. అయినప్పటికీ ఈ రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ఒకే రోజు ఉంటుంది అని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికత.. గర్వించదగ్గ వారసత్వం. మేము 100 శాతం నిష్పక్షపాతంగా ఉన్నాం అని ప్రకటించారాయన. కొందరు ప్రతికూల వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తారు. కానీ, మాటల కంటే చర్యలు, ఫలితాలు ఎక్కువగా మాట్లాడతాయి. కొన్నిసార్లు, కమిషన్‌ను విమర్శించే పార్టీలు ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలను పొందాయి. ఈ కేసులో థర్డ్ అంపైర్ లేడు. కానీ ఫలితాలు సాక్ష్యంగా ఉంటాయి అని రాజీవ్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రధాన ప్రతిపక్షాలు గుజరాత్ షెడ్యూల్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ప్రధాని మోదీ గుజరాత్ పర్యటన(దశల వారీగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరిగాయి) ముగిసే వరకు ఈసీ ఎదురు చూసిందని, తద్వారా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆటంకం ఎదురు కాకుండా పక్షపాతంగా వ్యవహరించిందని విమర్శిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇవాళ ఎన్నికల సంఘం గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి కొన్ని గంటల ముందు కూడా కాంగ్రెస్-బీజేపీలు ఈసీ తీరుపై పరస్పరం ట్వీట్లు చేసుకున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్ అసెంబ్లీ కాలపరిమితి ఫిబ్రవరి 18వ తేదీతో ముగియనుండగా.. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కాలపరిమితి జనవరి 8వ తేదీతో ముగుస్తుంది. నిజానికి ఈ రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల తేదీలను ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ, అది జరగలేదు. వాతావరణ పరిస్థితుల కారణంగా హిమాచల్‌కు కాస్త ముందుగా షెడ్యూల్ విడుదల చేసినట్లు ఈసీ వెల్లడించింది. మోడల్ ప్రవర్తనా నియమావళి 38 రోజుల పాటు అమలులో ఉంటుంది, ఇదే అతి తక్కువ వ్యవధి. అది ఢిల్లీ ఎన్నికల మాదిరిగానే ఉంటుందని రాజీవ్ కుమార్ తెలిపారు. అంతేకాదు.. అసెంబ్లీ కాలపరిమితికి కౌంటింగ్ డేకి మధ్య 72 రోజుల గ్యాప్ ఉందని గుర్తు చేశారాయన. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. వాతావరణం, అసెంబ్లీ చివరిరోజు లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. సాధారణంగా.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు ఒకేసారి వెలువడడం ఆనవాయితీగా వస్తోంది. కాబట్టి, సమతుల్యంగా వ్యహరించాల్సిన అవసరం మాకు ఉంది అని సీఈసీ వెల్లడించారు. మోర్బి ప్రమాద బాధితుల కోసం వెలువడే ప్రకటనలు.. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉండవచ్చా? అనే ప్రశ్నకు.. ఏదైనా నిర్ణయం వల్ల స్థాయి ఆటంకం ఏర్పడితే, ఎన్నికల సంఘం చర్య తీసుకుంటుందని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. -
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహిం చనున్నట్టు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరా వెల్లడించారు. డిసెంబర్ 23న ఫలితాలను వెల్లడించనున్నట్టు తెలిపారు. 2020 జనవరి 5వ తేదీతో ప్రస్తుత రాష్ట్ర శాసనసభ గడువు ముగియనుంది. మావోయిస్టు ప్రభావిత జార్ఖండ్ రాష్ట్రంలో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30వ తేదీన నిర్వహించనున్నారు. డిసెంబర్ 7న రెండో దశ, డిసెంబర్ 12, 16, 20వ తేదీల్లో మిగిలిన మూడు దశల్లో పోలింగ్ జరుపుతారు. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో 2014లో మాదిరిగానే ఐదు దశలుగా ఎన్నికలు నిర్వహించనునట్టు సునీల్ అరోరా వెల్లడించారు. రఘుబర్ దాస్ సీఎంగా 2014, డిసెంబర్ 28న జార్ఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయింది. -
భలే మంచి రోజు..!
సాక్షి, శ్రీకాకుళం : ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, నామినేషన్లు వేయడానికి రోజులు దగ్గర పడుతుండడంతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచే రాజకీయ నాయకులు మంచి ముహూర్తాల కోసం పండితులు, సిద్ధాంతుల వద్దకు పరుగు పెడుతున్నారు. జిల్లాలోని ప్రధాన పార్టీల అభ్యర్థులు, చిన్నాచితకా పార్టీల నాయకులు, స్వతంత్ర అభ్యర్థులు ఇలా ప్రతి ఒక్కరికీ ఎన్నికల సెంటిమెంట్ ఎక్కువగానే ఉంటుంది. ప్రధానంగా నామినేషన్ వేయడానికి మంచి ముహూర్తంతో పాటు తమ భవితవ్యాన్ని నిర్ణయించే ప్రచారాన్ని ఎప్పుడు, ఎక్కడి నుంచి ప్రారంభించాలనే సెంటిమెంట్‌ను వీరంతా ఫాలో అవుతుంటారు. 8 రోజులే చాన్స్ ఇదిలా ఉండగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఈనెల 18వ తేదీ నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ వేసేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఈ 8రోజుల్లో అభ్యర్థుల జాతకం ప్రకారం, తిథి, వార, నక్షత్రం ఆధారంగా సిద్ధాంతులు మంచిరోజులను నిర్ణయిస్తారు. ఈ పద్ధతి ఎప్పటి నుంచి ఆచరణలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా మంచి ముహూర్తాల కోసం అన్వేషిస్తున్నారు. ఈసారి నామినేషన్లకు కేవలం 8 రోజులు మాత్రమే గడువు ఉండగా..వాటిలో 18వ తేదీ ద్వాదశి, 19న త్రయోదశి, 22వ తేదీ విదియ, 25వ తేదీ పంచమి మంచి రోజులుగా లెక్కలు వేసుకుంటున్నారు. నామినేషన్లకు చివరిరోజైన 25వ తేదీన పంచమి సోమవారం బలమైన ముహూర్తం ఉండడంతో ఆరోజు నామినేషన్లు వేస్తే శుభం కలగుతుందని పండితులు చెబుతున్నారు. పేరు, జన్మనక్షత్రం, జాతకమే కీలకం.. అయితే పోటీచేసే అభ్యర్థిపేరు, జన్మనక్షత్రం, జాతకం ప్రకారమే ముహూర్తం నిర్ణయించాల్సి ఉంటుందని పడింతులు పేర్కొంటున్నారు. మొత్తంమీద ఈ నాలుగురోజులు పండితులు, సిద్ధాంతులను రాజకీయ నాయకులు ఊపిరి సలపనివ్వరని తెలుస్తోంది. నామినేషన్ ముహూర్తంతో పాటు ఎన్నికల ప్రచారం ఎప్పుడు, ఎక్కడి నుంచి ప్రారంభించాలనే దానిపై ఇప్పటికే పండితులు సూచించిన విధంగా కొంతమంది మొదలు పెట్టారు. మరికొంతమంది నిర్దిష్ట సమయం కోసం వేచి చూస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారం నియోజకవర్గానికి ఈశాన్యం నుంచి ప్రారంభించడం పరిపాటిగా జరుగుతుంది. అయితే కొందరు నాయకులు మాత్రం గతంలో ప్రచారం ప్రారంభించిన ప్రాంతాన్నే తమ సెంటిమెంట్‌గా భావించి ఎన్నికల బరిలో దిగుతున్నారు. అయితే ఆ సెంటిమెంట్లు ఎవరిని విజేతలుగా నిలుపుతాయో వేచి చూడాలి. -
నాలుగు స్తంభాలాట...
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో గోవాలో వేడి రాజుకుంది. త్వరలో జరిగే ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని భావించినా... ఇప్పుడు పోరు నాలుగు స్తంభాలాటగా మారింది. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న మహారాష్ట్రవాది గోమాంతక్పార్టీ (ఎంజీపీ) ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని బరిలో దిగేందుకు నిర్ణయించింది. దీంతో ఫిబ్రవరి 4న జరిగే ఎన్నికల కోసం బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌తో పాటు ఎంజీపీ కూటమి మధ్య చతుర్ముఖ పోటీ ఆసక్తి రేపుతోంది. ఓట్ల చీలిక ఎవరికి చేటు చేస్తుందన్న ఆందోళనతో ప్రధాన పార్టీలన్నీ తలలు పట్టుకుంటున్నాయి. 40 స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఏ పార్టీకీ విస్పష్ట మెజార్టీ రాకపోవచ్చని అంచనా. బీజేపీకి పోటీగా... 2012 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎంజీపీలు కలసి పోటీ చేశాయి. బీజేపీ 21 స్థానాలతోమెజార్టీ సాధించినా... ఎంజీపీతో (3 సీట్లు) కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మనోహర్ పరీకర్ రక్షణమంత్రిగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడంతో లక్ష్మీకాంత్ పరే్సకర్ గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పరే్సకర్ను సీఎంగా తప్పించాలంటూ ఎంజీపీ అధ్యక్షుడు దీపక్ ధావిల్కర్ ఆర్నెలలుగా విమర్శలు చేస్తున్నారు. దాంతో ధావిల్కర్ సోదరులు దీపక్, సుది¯ŒSలను పరే్సకర్ మంత్రివర్గం నుంచి తొలగించారు. ఇక బీజేపీతో ఎంజీపీ తెగదెంపులు ఖాయమంటూ వార్తలు వినిపించినా... గురువారం పరే్సకర్ ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు ఎంజీపీ ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లలో 22 స్థానాలకు పోటీచేస్తామని దీపక్ తెలిపారు. గోవా సురక్ష మంచ్‌తో పొత్తు పెట్టుకుంటామని, సోదరుడు సుదిన్ సీఎం అభ్యర్థిగా ఉంటారన్నారు. ఆరెస్సెస్ గోవా శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన సుభాష్ వెలింగ్కర్... గోవా సురక్ష మంచ్‌ను ఏర్పాటు చేశారు. కొంకణి, మరాఠీ పాఠశాలలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందించాలని, ఆంగ్ల మాధ్యమ పాఠశాలలకు నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ పాలనను ప్రశ్నించడంతో ఆరెస్సెస్ నుంచి బహిష్కరణకు గురై సొంత కుంపటి పెట్టారు. మరోవైపు శివసేన కూడా గోవా సురక్ష మంచ్‌తో అవగాహనకు వచ్చింది. ఎంజీపీ చేరికతో కొత్త కూటమి రాబోతోంది. గోవాలో హిం దువుల జనాభా 66%.. ఆ ఓటు బ్యాంకుకు కొత్త కూటమి (ఎంజీపీ, గోవా సురక్ష మంచ్, శివసేన) గండికొడుతుందని కమలనాథుల ఆందోళన. ‘ప్రత్యేక’ గండం రెండేళ్లవుతున్నా ప్రస్తుత సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్‌కు ఇంకా పాలనపై పట్టు చిక్కలేదు. గోవాకు ప్రత్యేక హోదా తెస్తామని 2012లో బీజేపీ మేనిఫెస్టోలో చెప్పింది. ప్రత్యేక హోదా సాధ్యంకాదని స్వయంగా రక్షణ మంత్రి పరీకరే గత నవంబరులో తేల్చిచెప్పేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశం ఈసారి విపక్షాలకు అస్త్రం కానుంది. మండోవి నదితీరం వెంట క్యాసినోలు తొలగిస్తామన్న హామీనీ బీజేపీ నిలబెట్టుకోలేకపోయింది. దీంతో మధ్యతరగతి ప్రజల్లో బీజేపీపై విశ్వాసం సడలింది. మరోవైపు పరే్సకర్ పాలనపై జనం అసంతృప్తి, కొత్త హిందూత్వ కూటమి ఆవిర్భావం, హామీల అమలులో వైఫల్యం... బీజేపీకి ప్రతికూలాంశాలు. అందుకే పరే్సకర్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ఇంకా ప్రకటించపోవడంతో మళ్లీ పరీకర్ రాష్ట్రానికి రావచ్చని ఓటర్లు భావిస్తారనే కమలనాథుల ఆశ. కాంగ్రెస్‌కు... ఆప్ ముప్పు గత ఎన్నికల్లో 0.66 ఓట్ల శాతం తేడాతో కాంగ్రెస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. సంప్రదాయ ఓటు బ్యాంకే కాంగ్రెస్ బలం. క్యాథలిక్కులు 8–10 స్థానాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో హిందూ ఓట్ల చీలిక కాంగ్రెస్‌కు లాభించినా... ఆప్ తమ విజయాన్ని దెబ్బతీయొచ్చని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. సెక్యులర్ పార్టీలు కూటమిగా ఏర్పడితే కాంగ్రెస్‌కు అధికారం దక్కే అవకాశాలున్నా.. పొత్తుకు ఆప్ ఆసక్తి చూపడం లేదు. బలమైన స్థానిక నాయకత్వం లేకపోవడం ఆప్‌కు పెద్ద లోటు. కేజ్రీవాల్ ప్రచారంపైనే ఆశలు పెట్టుకుంది. -
ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా
దేశంలోని ఐదు ప్రధాన రాష్ట్రాల ఎన్నికల తేదీలను ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) నసీమ్ జైదీ శుక్రవారం ప్రకటించారు. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూలును జైదీ విడుదల చేశారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి మే 16వ తేదీ వరకు వివిధ రాష్ట్రాలకు వివిధ రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. కేరళలో 140, తమిళనాడులో 234, పశ్చిమ బెంగాల్లో 294, అసోంలో 126, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఐదు రాష్ట్రాల్లో కలిపి 824 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. కేరళలో 21వేలు, తమిళనాడులో 65వేలు, పశ్చిమ బెంగాల్లో 77వేలు, పుదుచ్చేరిలో 913 చొప్పున పోలింగ్ కేంద్రాలు ఉంటాయని జైదీ తెలిపారు. అన్నిచోట్లా ఈవీఎంలనే ఉపయోగిస్తామని అన్నారు. నోటాకు కూడా ప్రత్యేక గుర్తును ఈ ఎన్నికల నుంచి కేటాయిస్తున్నట్లు ఆయన చెప్పారు. 64 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి ఈవీఎంలకు ప్రింటర్లు జతచేస్తున్నామని అన్నారు. అభ్యర్థులందరి ఫొటోలను కూడా ఈవీఎంలలో ఉంచుతామని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అసోంలో 2 దశలలోను, పశ్చిమబెంగాల్లో 6 దశలలోను, మిగిలిన మూడు రాష్ట్రాలు.. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ఒకే దశలోను ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన మే 19వ తేదీన ఉంటాయి. మొత్తం ఎన్నికల ప్రక్రియ మే 21 నాటికి ముగుస్తుందని నసీం జైదీ ప్రకటించారు. అసోం తొలి దశ 65 నియోజకవర్గాలు నోటిఫికేషన్ జారీ: మార్చి 11 నామినేషన్ల ముగింపు తేదీ: 18 మార్చి నామినేషన్ల పరిశీలన: 19 మార్చి ఉపసంహరణ గడువు: 21 మార్చి పోలింగ్ తేదీ: 4 ఏప్రిల్ (సోమవారం) రెండోదశ 61 నియోజకవర్గాలు నోటిఫికేషన్ జారీ: మార్చి 14 నామినేషన్ల ముగింపు తేదీ: 21 మార్చి నామినేషన్ల పరిశీలన: 22 మార్చి ఉపసంహరణ గడువు: 26 మార్చి పోలింగ్ తేదీ: 11 ఏప్రిల్ (సోమవారం) పశ్చిమబెంగాల్ తొలి దశ 18 నియోజకవర్గాలు (రెండుసార్లుగా జరుగుతుంది) నోటిఫికేషన్ జారీ: 11 మార్చి, 21 మార్చి నామినేషన్ల ముగింపు తేదీ: 18 మార్చి, 22 మార్చి నామినేషన్ల పరిశీలన: 19 మార్చి, 26 మార్చి పోలింగ్ తేదీలు: 4 ఏప్రిల్, 11 ఏప్రిల్ రెండోదశ 56 నియోజకవర్గాలు నోటిఫికేషన్ జారీ: 22 మార్చి నామినేషన్ల ముగింపు తేదీ: 29 మార్చి నామినేషన్ల పరిశీలన: 30 మార్చి ఉపసంహరణ గడువు: ఏప్రిల్ 1 పోలింగ్ తేదీ: 17 ఏప్రిల్ మూడోదశ 62 నియోకవర్గాలు నోటిఫికేషన్ జారీ: 28 మార్చి నామినేషన్ల ముగింపు తేదీ: 4 ఏప్రిల్ నామినేషన్ల పరిశీలన: 5 ఏప్రిల్ ఉపసంహరణ గడువు: 7 ఏప్రిల్ పోలింగ్ తేదీ: 21 ఏప్రిల్ నాలుగోదశ 49 నియోజకవర్గాలు నోటిఫికేషన్ జారీ: ఏప్రిల్ 1 నామినేషన్ల ముగింపు తేదీ: ఏప్రిల్ 4 నామినేషన్ల పరిశీలన: 9 ఏప్రిల్ ఉపసంహరణ గడువు: 11 ఏప్రిల్ పోలింగ్ తేదీ: 25 ఏప్రిల్ ఐదోదశ 53 నియోజకవర్గాలు నోటిఫికేషన్ జారీ: ఏప్రిల్ 4 నామినేషన్ల ముగింపు తేదీ: ఏప్రిల్ 11 నామినేషన్ల పరిశీలన: 12 ఏప్రిల్ ఉపసంహరణ గడువు: 16 ఏప్రిల్ పోలింగ్ తేదీ: 30 ఏప్రిల్ ఆరోదశ 25 నియోజకవర్గాలు నోటిఫికేషన్ జారీ: ఏప్రిల్ 11 నామినేషన్ల ముగింపు తేదీ: ఏప్రిల్ 18 నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 19 ఉపసంహరణ గడువు: ఏప్రిల్ 21 పోలింగ్ తేదీ: మే 5 కేరళ 140 నియోజకవర్గాలు ఒకేదశ నోటిఫికేషన్ జారీ: 22 ఏప్రిల్ నామినేషన్ల ముగింపు తేదీ: 29 ఏప్రిల్ నామినేషన్ల పరిశీలన: 30 ఏప్రిల్ ఉపసంహరణ గడువు: 2 మే పోలింగ్ తేదీ: 16 మే తమిళనాడు 234 నియోజకవర్గాలు ఒకే దశ నోటిఫికేషన్ జారీ: 22 ఏప్రిల్ నామినేషన్ల ముగింపు తేదీ: 29 ఏప్రిల్ నామినేషన్ల పరిశీలన: 30 ఏప్రిల్ ఉపసంహరణ గడువు: 2 మే పోలింగ్ తేదీ: 16 మే పుదుచ్చేరి 30 నియోజకవర్గాలు ఒకేదశ నోటిఫికేషన్ జారీ: 22 ఏప్రిల్ నామినేషన్ల ముగింపు తేదీ: 29 ఏప్రిల్ నామినేషన్ల పరిశీలన: 30 ఏప్రిల్ ఉపసంహరణ గడువు: 2 మే పోలింగ్ తేదీ: 16 మే ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన తేదీ: మే 19 ఎన్నికల ప్రక్రియముగింపు 21 మే