నాలుగు స్తంభాలాట...
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో గోవాలో వేడి రాజుకుంది. త్వరలో జరిగే ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని భావించినా... ఇప్పుడు పోరు నాలుగు స్తంభాలాటగా మారింది. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న మహారాష్ట్రవాది గోమాంతక్‌పార్టీ (ఎంజీపీ) ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని బరిలో దిగేందుకు నిర్ణయించింది. దీంతో ఫిబ్రవరి 4న జరిగే ఎన్నికల కోసం బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌తో పాటు ఎంజీపీ కూటమి మధ్య చతుర్ముఖ పోటీ ఆసక్తి రేపుతోంది. ఓట్ల చీలిక ఎవరికి చేటు చేస్తుందన్న ఆందోళనతో ప్రధాన పార్టీలన్నీ తలలు పట్టుకుంటున్నాయి. 40 స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఏ పార్టీకీ విస్పష్ట మెజార్టీ రాకపోవచ్చని అంచనా.
బీజేపీకి పోటీగా...
2012 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎంజీపీలు కలసి పోటీ చేశాయి. బీజేపీ 21 స్థానాలతోమెజార్టీ సాధించినా... ఎంజీపీతో (3 సీట్లు) కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మనోహర్ పరీకర్ రక్షణమంత్రిగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడంతో లక్ష్మీకాంత్ పరే్సకర్ గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పరే్సకర్‌ను సీఎంగా తప్పించాలంటూ ఎంజీపీ అధ్యక్షుడు దీపక్ ధావిల్కర్ ఆర్నెలలుగా విమర్శలు చేస్తున్నారు. దాంతో ధావిల్కర్ సోదరులు దీపక్, సుది¯ŒSలను పరే్సకర్ మంత్రివర్గం నుంచి తొలగించారు. ఇక బీజేపీతో ఎంజీపీ తెగదెంపులు ఖాయమంటూ వార్తలు వినిపించినా... గురువారం పరే్సకర్ ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు ఎంజీపీ ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లలో 22 స్థానాలకు పోటీచేస్తామని దీపక్ తెలిపారు. గోవా సురక్ష మంచ్‌తో పొత్తు పెట్టుకుంటామని, సోదరుడు సుదిన్ సీఎం అభ్యర్థిగా ఉంటారన్నారు.
ఆరెస్సెస్ గోవా శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన సుభాష్ వెలింగ్‌కర్... గోవా సురక్ష మంచ్‌ను ఏర్పాటు చేశారు. కొంకణి, మరాఠీ పాఠశాలలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందించాలని, ఆంగ్ల మాధ్యమ పాఠశాలలకు నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ పాలనను ప్రశ్నించడంతో ఆరెస్సెస్ నుంచి బహిష్కరణకు గురై సొంత కుంపటి పెట్టారు. మరోవైపు శివసేన కూడా గోవా సురక్ష మంచ్‌తో అవగాహనకు వచ్చింది. ఎంజీపీ చేరికతో కొత్త కూటమి రాబోతోంది. గోవాలో హిం దువుల జనాభా 66%.. ఆ ఓటు బ్యాంకుకు కొత్త కూటమి (ఎంజీపీ, గోవా సురక్ష మంచ్, శివసేన) గండికొడుతుందని కమలనాథుల ఆందోళన.
‘ప్రత్యేక’ గండం
రెండేళ్లవుతున్నా ప్రస్తుత సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్‌కు ఇంకా పాలనపై పట్టు చిక్కలేదు. గోవాకు ప్రత్యేక హోదా తెస్తామని 2012లో బీజేపీ మేనిఫెస్టోలో చెప్పింది. ప్రత్యేక హోదా సాధ్యంకాదని స్వయంగా రక్షణ మంత్రి పరీకరే గత నవంబరులో తేల్చిచెప్పేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశం ఈసారి విపక్షాలకు అస్త్రం కానుంది. మండోవి నదితీరం వెంట క్యాసినోలు తొలగిస్తామన్న హామీనీ బీజేపీ నిలబెట్టుకోలేకపోయింది. దీంతో మధ్యతరగతి ప్రజల్లో బీజేపీపై విశ్వాసం సడలింది. మరోవైపు పరే్సకర్ పాలనపై జనం అసంతృప్తి, కొత్త హిందూత్వ కూటమి ఆవిర్భావం, హామీల అమలులో వైఫల్యం... బీజేపీకి ప్రతికూలాంశాలు. అందుకే పరే్సకర్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ఇంకా ప్రకటించపోవడంతో మళ్లీ పరీకర్ రాష్ట్రానికి రావచ్చని ఓటర్లు భావిస్తారనే కమలనాథుల ఆశ.
కాంగ్రెస్‌కు... ఆప్ ముప్పు
గత ఎన్నికల్లో 0.66 ఓట్ల శాతం తేడాతో కాంగ్రెస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. సంప్రదాయ ఓటు బ్యాంకే కాంగ్రెస్ బలం. క్యాథలిక్కులు 8–10 స్థానాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో హిందూ ఓట్ల చీలిక కాంగ్రెస్‌కు లాభించినా... ఆప్ తమ విజయాన్ని దెబ్బతీయొచ్చని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. సెక్యులర్ పార్టీలు కూటమిగా ఏర్పడితే కాంగ్రెస్‌కు అధికారం దక్కే అవకాశాలున్నా.. పొత్తుకు ఆప్ ఆసక్తి చూపడం లేదు. బలమైన స్థానిక నాయకత్వం లేకపోవడం ఆప్‌కు పెద్ద లోటు. కేజ్రీవాల్ ప్రచారంపైనే ఆశలు పెట్టుకుంది.