సాక్షి, కరీంనగర్: రాజకీయ భవిష్యత్తుపై సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రకటిస్తానని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మూడు రోజులుగా వేలాది మంది ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులతో మాట్లాడానన్నారు. ఉమ్మడి కరీంనగర్ నుంచే కాకుండా ఖమ్మం సహా 9 పాత జిల్లాల నుంచి కార్యకర్తలు పరామర్శించేందుకు వచ్చినట్లు తెలిపారు. బుధవారం హుజూరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తనను కలవడానికి వచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ సంఘాల వారితో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘నా నిర్ణయానికి సంబంధించి నియోజకవర్గంలోని ప్రజలు రెండు రకాలుగా అభిప్రాయాలను వెల్లడించారు. వాటిని బేరీజు వేసుకుంటున్నా.
ప్రస్తుతం కరోనాతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. కరోనాను నివారించడంతోపాటు, కరోనా బారిన పడ్డ వారిని కాపాడుకోవడం ముఖ్యమైన అంశం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో హుజూరాబాద్ కీలకంగా వ్యవహరించింది. 20 ఏళ్లుగా ఇక్కడి ప్రజలకు తెలంగాణ ఉద్యమ అనుబంధం ఉంది. నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలోని ఉప్పల్‌లో రైల్‌రోకో చేసి అప్పటి ఢిల్లీ సర్కారుకు తెలంగాణ చైతన్యాన్ని చాటి చెప్పాం. అప్పుడు ఉప్పల్ రైల్వేస్టేషన్‌లో పోలీసులు ఫైరింగ్‌కు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఈ ప్రాంత ప్రజలు లెక్కచేయలేదు. ఉద్యమాన్ని ధైర్యంతో ముందుకు తీసుకెళ్లారు. టీఆర్‌ఎస్ పార్టీ బీ ఫామ్ ఇస్తే నియోజకవర్గ ప్రజలు గెలిపించారు.
ఇక్కడి ప్రజలు, నాయకుల కమిట్‌మెంట్ ఎంతో గొప్పది. నాకు జరిగిన అన్యా యాన్ని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. నేను తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి పనిచేస్తామంటున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు వచ్చి మీకు జరిగిన అన్యాయం, దుర్మార్గం సహించరానిదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎన్నారైలు కూడా వారి సలహాలు, సూచనలు ఇచ్చారు’అని ఈటల వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు ఏం కోరుకున్నారో అది నేడు జరగడం లేదన్నారు. ఇప్పుడు ఆత్మ గౌరవం ప్రధాన సమస్యగా మారిందని, హైదరాబాద్‌లో ఉన్న తన ఆత్మీయులు, శ్రేయోభిలాషులతో మాట్లాడి సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తానని ఈటల చెప్పారు.
రాజీనామాపై భిన్నాభిప్రాయాలు
మూడు రోజులపాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గ పర్యటన పూర్తి చేసుకున్నమాజీ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం సాయంత్రం తిరిగి శామీర్‌పేటలోని తన నివాసానికి చేరుకున్నారు. మూడు రోజులపాటు హుజూరాబాద్ క్యాంపు కార్యాలయంలో స్థానిక నేతలు, కార్యకర్తలతో పాటు పార్టీకి చెందిన అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నేతలతో ఈటల భేటీ అయ్యారు. శాసనసభ్యత్వంతో పాటు పారీ్టకి రాజీనామా చేసే విషయంలో ఈటల అనుచరులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. పార్టీలో కొనసాగాలని కొందరు కోరగా, రాజీనామా చేసి బయటకు వస్తే వెంట నడుస్తామని మరికొందరు ప్రకటించారు. దీంతో వివిధ రంగాలకు చెందిన వారితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలనే యోచనకు ఈటల వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు మెదక్ జిల్లా అచ్చంపేట, హకీంపేట అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇప్పటికే కోర్టు మెట్లు ఎక్కిన ఈటల, దేవరయాంజాల్ భూముల విషయంలోనూ న్యాయ నిపుణులతో చర్చించనున్నట్లు సమాచారం.
( చదవండి: ఈటల రాజేందర్ బర్తరఫ్‌పై నిరసన )
Comments
Please login to add a commentAdd a comment