మునుగోడు: నల్లగొండ జిల్లా మునుగోడులో ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మునుగోడులో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామితో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 21న కేంద్ర హోంమంత్రి సభ నిర్వహిస్తున్నట్లు నెల రోజుల క్రితమే తాము ప్రకటించామని, అయితే సీఎం కేసీఆర్ కావాలనే ఒకరోజు ముందు ‘మునుగోడు ప్రజా దీవెన’పేరిట సభ ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్నారు.
ఎనిమిదేళ్ల కాలంలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయని సీఎం కేసీఆర్, మునుగోడు సభకు వచ్చే ముందు ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో మునుగోడు సమస్యలని సీఎం దృష్టికి తీసుకొస్తే.. ఏ ఒక్క రోజూ పట్టించుకోలేదన్నారు. ఎక్కడై నా ఉప ఎన్నికలు వస్తే తప్ప ఆయన ఆ ప్రాంత అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడంతోనే తాను పదవీ త్యాగం చేసినట్లు వివరించారు.
రాష్ట్రంలో నియంత పాలనను అంతమొందించాలంటే అది బీజేపీతోనే సాధ్యమన్నారు. అందుకే తాను 21న అమిత్‌షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఉప ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్ ఆ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నారని విమర్శించారు. ఆ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అనేక హామీలు గుప్పించి ఈ తర్వాత విస్మరించడం ఆయనకు పరిపాటిగా మారిందన్నారు. సమావేశంలో మాజీ ఎంపీలు రమేశ్ కుమార్ నాయక్, రమేశ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment