UPDATES
TIME: 07:40
► కరీంనగర్ జైలు నుంచి బెయిల్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ విడుదలయ్యారు. కరీంనగర్ జైలు వద్దకు బీజేపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు.
TIME: 06:20
►కరీంనగర్ జైలు వద్దకు కేంద్ర సహాయ మంత్రి భగవంత్ కూబా చేరుకున్నారు. బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పరామర్శించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
TIME: 05:00
► మరికాసేపట్లో జైలు నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విడుదల కానున్నారు. విడుదలకు జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ జైలు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. వెంటనే ఆయన్ను విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. కరీంనగర్‌లో తనపై నమోదు చేసిన కేసులపై బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై కరీంనగర్ మెజిస్ట్రేట్ ఇచ్చిన జ్యూడిషియల్ రిమాండ్ ఆర్డర్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. బండి సంజయ్ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
కాగా తనపై దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్‌ను క్వాష్ చేయాలని బండి సంజయ్‌పై తరపు న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి హైకోర్టులో బుధవారం వాదనలు వినిపించారు. బండి సంజయ్‌పై అక్రమ కేసులు, సెక్షన్స్ నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. ఇదంతా ప్రభుత్వం దురుద్దేశ పూర్వకంగా చేసిందని కోర్టుకు విన్నవించారు. సంజయ్ మేజిస్ట్రేట్ జ్యూడిషియల్ కస్టడీ 15 రోజులు చట్టం ప్రకారం సరైంది కాదని దేశాయ్ ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. దేశాయ్ వాదనలు విన్న హైకోర్టు.. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని రిమాండ్‌కు ఆదేశాలివ్వడం సరికాదని పేర్కొంది.
చదవండి: ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్నట్లు కేసీఆర్ పాలన: జేపీ నడ్డా
అరెస్టు చేసిన 15 నిమిషాల్లోనే ఎఫ్‌ఐఆర్ ఎలా సాధ్యమని ప్రశ్నించింది. ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్ 333 అదనంగా ఎందుకు చేర్చారని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. పోలీసుల తీరును తప్పుపట్టిన హైకోర్టు.. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 17వ తారీఖు వరకు రిమాండ్ ఇవ్వడం అనేది సరైనది కాదంటూ.. తదుపరి విచారణను ఈనెల 7కు వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా.. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను సవరించాలంటూ బండి సంజయ్ కరీంనగర్‌లో జాగరణ దీక్ష తలపెట్టిన విషయం తెలిసిందే. కోవిడ్ నేపథ్యంలో దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఎంపీ సంజయ్ దీక్షను భగ్నం చేసి లాఠీఛార్జీలు, తోపులాటల మధ్య అరెస్టు చేశారు. అనంతరం కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు కరీంనగర్ పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ బండి సంజయ్ మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment