సాక్షిప్రతినిధి, వరంగల్: హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. నేడో రేపో నోటిఫికేషన్ అంటూ ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరనే దానిపై రాజకీయ విశ్లేషకుల్లో ఉత్కంఠగా మారింది. నియోజకవర్గంలో రోజు రోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాలు, పెరుగుతున్న పార్టీ ఫిరాయింపుల దరిమిలా ప్రధాన పార్టీలు చివరి నిమిషంలో ఎవరిని బరిలోకి దింపుతాయన్న చర్చ సాగుతోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులపై ఆచితూచి వ్యవహరిస్తుండటం మరింత ఉత్కంఠగా మారింది.
టీఆర్‌ఎస్ అభ్యర్థిపై భారీ కసరత్తు..
ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత దూకుడు పెంచిన టీఆర్‌ఎస్, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, కేడర్‌ను మళ్లీ పోరుకు సిద్ధం చేసింది. ఈటల రాజేందర్ వెంట వెళ్లిన వారిని సొంతగూటికి చేర్చుకుంది. విజయం సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పథకాల అమలుతోపాటు దీటైన అభ్యర్థుల వేటలో మునిగింది. తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో కీలకంగా పనిచేసిన గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పేరు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బాగా వినిపిస్తోంది. బీసీ వర్గానికి చెందిన బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, మాజీ మంత్రి ఎల్.రమణ, పొనగంటి మల్లయ్య పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఓసీలకు టికెట్ వస్తుందనుకున్నా.. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి, పెద్దిరెడ్డికి కచ్చితమైన హామీ ఇవ్వడంతో వారు తప్పుకున్నట్లే లెక్క. కాగా, యప్ టీవీ అధినేత, మంత్రి కేటీఆర్‌కు సన్నిహితుడిగా పేరున్న పాడి ఉదయానందరెడ్డి పేరు తాజాగా తెరమీదకు వచ్చింది.
బీజేపీ నుంచి ఈటల.. కాంగ్రెస్ నుంచి కొండా
బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీలో ఉండనున్నారు. అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో టీఆర్‌ఎస్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఒకటీ అర శాతం మార్పులు ఉండొచ్చన్న చర్చ కూడా జరుగుతోంది. అదే జరిగితే రాజేందర్ సతీమణి జమునారెడ్డి బరిలో ఉండొచ్చని చెబుతున్నారు. కాగా, నియోజకవర్గానికి ఇన్‌చార్జులను నియమించినా కాంగ్రెస్ ఇంకా స్తబ్దతగానే ఉంది. అయితే ఈ పార్టీ నుంచి మాజీ మంత్రి కొండా సురేఖను బరిలో దింపే అవకాశం ఉన్నట్లు పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇటీవల ఈ నియోజకవర్గం ఇన్‌చార్జ్ దామోదర రాజనర్సింహ ప్రెస్‌మీట్‌లో ఇవే సంకేతాలు ఇచ్చారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. దళిత సామాజిక వర్గం నేతలకు అవకాశం ఇవ్వాలనుకుంటే ఆ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపెల్లి సత్యనారాయణ, వరంగల్‌కు చెందిన దొమ్మాటి సాంబయ్య పేర్లు విన్పిస్తున్నాయి. ఇదిలా వుంటే ఎంపీటీసీల ఫోరం, ఉపాధిహామీ ఫీల్డ్/టెక్నికల్ అసిస్టెంట్లు హుజూరాబాద్ ఉప ఎన్నికను వేదికగా చేసుకుని తమ నిరసనను నామినేషన్ల ద్వారా తెలియజేస్తామని ప్రకటించడం కూడా చర్చనీయాంశం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment