మీడియాతో మాట్లాడుతున్న జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అన్నారు. ‘తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు రాహుల్‌గాంధీ క్షమాపణలు చెప్పాలా?’ అని ప్రశ్నించిన ఆయన ఒకరి గురించి మాట్లాడే ముందు తానేంటో ఆలోచించుకోవాలని సుమన్‌కు హితవు పలికారు. టీఆర్‌ఎస్ నేతలందరూ సోనియా, రాహుల్‌ల కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన పోసుకున్నా రుణం తీర్చుకోలేరన్నారు.
గాంధీభవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ కోసం కేసీఆర్ పోరాటాన్ని ఎవరూ కాదనలేరని, కానీ సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోతే వీరి రాజకీయ జీవితం ఎలా ఉండేదో అర్థం చేసుకోవాలన్నారు. ఉస్మానియాలో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల శవాల మీద ఎంపీ, ఎమ్మెల్యే అయిన సుమన్.. తెలంగాణలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాడో చెప్పాలని సవాల్ విసిరారు. ఉద్యమంలో త్యాగాలు చేసినవాళ్లు కనుమరుగైతే, సుమన్ లాంటి వాళ్లు ఎమ్మెల్యేలు, ఎంపీలయ్యారని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం రాకపోతే సుమన్ గ్రామ పంచాయతీ సభ్యుడు కూడా కాలేడన్నారు. ఓయూలో రాహుల్‌గాంధీ పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే టీఆర్‌ఎస్ పార్టీకి కృతజ్ఞతాభావం లేదని తేలిపోతుందని, రాష్ట్రం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుతారో, కృతజ్ఞతా హీనులుగా మిగులుతారో టీఆర్‌ఎస్ నేతలే తేల్చుకోవాలని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment