సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. నేడో రేపో షెడ్యూల్ రానున్న వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో కుల రాజకీయాలు తెర మీదకు వస్తున్నాయి. ఓవైపు బీసీ నేతలు తమకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ కాంగ్రెస్‌పై ఒత్తిడి చేస్తున్న వేళ.. తాజాగా తమ కులం తమకు సీట్లు కావాలని, తామూ పోటీ చేస్తామంటూ కాంగ్రెస్ అగ్రనేతల్ని కలవడం చర్చనీయాంశంగా మారింది.
అసెంబ్లీ ఎన్నికల ముందర తెలంగాణలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు, ఐక్య వేదికలు ఒక తాటి మీదకు వచ్చాయి. ఎన్నికల్లో తమకూ ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని డిమాండ్‌ను లెవనెత్తాయి. దీనికి ఆ సామాజిక వర్గం నేతలు బహిరంగంగా మద్దతు ప్రకటించేశారు కూడా. తెలంగాణలో తమ బలం బాగానే ఉందని.. అవకాశం ఇస్తే 40 సీట్ల దాకా తెచ్చి చూపిస్తామని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు సదరు కమ్మ నేతలు.
తాజాగా.. తెలంగాణ కమ్మవారి రాజకీయ ఐక్య వేదిక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ని కలిసి లేఖ ఇచ్చింది. తమను గుర్తించి.. టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలంటూ లేఖలో కోరింది. సినీ, రాజకీయ పరిశ్రమల్లో సత్తా చాటుతున్న కమ్మ వాళ్లకు ఓటు అధికారంతో పాటు సీటు అధికారం కూడా ఇవ్వాల్సిందేనంటూ ఈ సందర్భంగా అక్కడ ఉన్న మాజీ ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యానించడం గమనార్హం.
చంద్రబాబు శిష్యుడి ద్వారానే..
కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి తొలి నుంచి ట్రబుల్ మేకర్‌గా ఉన్నారనే వాదన ఒకటి ఉంది. ఎప్పుడైతే టీపీసీసీ చీఫ్ అయ్యారో.. అప్పటి నుంచి కాంగ్రెస్‌లో లుకలుకలు తారాస్థాయికి చేరాయి. తన ఆధిపత్య ధోరణితో ఆయన తమనూ అణగదొక్కుతున్నారంటూ సీనియర్లు సైతం బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా.. రేవంత్ సమర్థత కన్నా చంద్రబాబు శిష్యుడిగా ఆయన మీద పార్టీలో అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేతలే ఎక్కువగా ఉన్నారు.
ఈ తరుణంలో ఇప్పుడు కమ్మ సామాజిక వర్గ డిమాండ్‌పైనా రేవంత్ పేరు ప్రస్తావనకు వచ్చింది. తుమ్మల కాంగ్రెస్‌లో చేరిక వెనుక రేవంత్ ప్రముఖ పాత్ర పోషించారన్న టాక్ ఒకటి ఉంది. ఈ నేపథ్యంలో.. కమ్మ నేతలు వాళ్ల సీట్ల ప్రయత్నాలు రేవంత్ ద్వారానే నెరవేర్చుకోవాలని భావిస్తున్నారట. తమ పాత పరిచయాలతో రేవంత్‌రెడ్డిని కలుస్తున్న కొందరు.. తమ సీట్లకు పార్టీ అధిష్టానాన్ని ఒప్పించే బాధ్యతను అప్పజెప్పినట్లు భోగట్టా. ఇది మిగతా కులాల నుంచి ఏమేర అభ్యంతరాలకు దారి తీస్తుందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే!.
కాంగ్రెస్ టిక్కెట్లు త్వరలోనే ఖరారు చేస్తారన్న ఉద్దేశ్యంతో ఇప్పటికే అనేక మంది ఆశావహులు ఢిల్లీ బాట పట్టారు. అక్కడ స్క్రీనింగ్ కమిటీ పెద్దలతో పాు ఏఐసీసీ నేతలను కలసి తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరనున్నారు. ఇప్పటికే టికెట్ల ఇష్యూ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ దశలో కులాలు, వర్గాల వారీగా రోజుకో కొత్త డిమాండ్ కాంగ్రెస్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment