సాక్షి, నాగర్‌కర్నూల్: కొల్లాపూర్ నియోజకవర్గంలో అన్ని పార్టీల్లో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఏ పార్టీ నుంచి ఎవరికి సీటు ఇచ్చినా ఆపార్టీల్లోని ఇంకోవర్గం వ్యతిరేకంగా పనిచేసే పరిస్ధితి నెలకొంది. ఆయా పార్టీల అధిష్టానాలు కూడా గ్రూపు రాజకీయాలను చక్కదిద్దటంలో విఫలమవుతున్నాయి. దీంతో ఆ సెగ్మెంట్లో ఎవరికివారు యమునా తీరే అన్నా రీతిలో వ్యవహారం నడుస్తోంది. ఫామ్ హౌజ్ ఎపిసోడ్‌లో ఇక్కడి ఎమ్మెల్యే కూడా ఉండటం సంచలనం రేపింది. హస్తానికి హ్యాండిచ్చి కారెక్కిన హర్షవర్థన్‌రెడ్డి పరిస్థితి ఎలా ఉందో ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో చూద్దాం.
మంత్రిగా పోటీ చేసినా..!
ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజవర్గంలో మొత్తం 2 లక్షల 14 వేల 594 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన హర్షవర్థన్‌రెడ్డి తర్వాతి రాజకీయ పరిణామాల్లో హస్తాన్ని వీడి గులాబీ గూటికి చేరారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు... హర్షవర్థన్‌రెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఇప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలో ఉండటంతో సిటింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కొనసాగుతోంది. నువ్వా.. నేనా అన్న రీతిలో సవాళ్ళు విసురుకుంటున్నారు.
వీరిద్దరి కారణంగా కొల్లాపూర్లోని గులాబీ పార్టీ కేడర్ రెండుగా చీలిపోయింది. ఇది పార్టీకి తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో హర్షవర్థన్‌రెడ్డి బలపడటం.. రోజు రోజుకు జూపల్లికి ప్రాధాన్యత తగ్గటం మొదలయ్యింది. దీంతో తన ఉనికిని చాటుకునేందుకు స్దానిక సంస్ధల ఎన్నికల్లో జూపల్లి తన అనుచరులను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపునుంచి బరిలో దింపి సత్తా చాటారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం రోజురోజుకు పెరుగుతోంది తప్పా ఎక్కడా సమసిపోవడంలేదు. గులాబీ పార్టీ నాయకత్వం కూడా ఇద్దరి మధ్య సంధి కుదిర్చేందుకు దృష్టి కూడా పెట్టలేదు. వ్యక్తిగత విమర్శలు, అవినీతి ఆరోపణలతో ఇద్దరూ ఇటీవలే బహిరంగచర్చ పేరుతో నానా హంగామా చేశారు.
ఫాంహౌస్ పాలిటిక్స్
పార్టీలో అంతర్గత విభేదాలు వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వచ్చేసారి బీఆర్ఎస్ నుంచి తమ నాయకుడే పోటీ చేస్తారంటూ హర్షవర్థన్, జూపల్లి వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే జూపల్లి పార్టీ మారుతారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. పార్టీ మారితే ఆయన పాత గూడు కాంగ్రెస్‌కు చేరుతారా లేక కాషాయ కండువా కప్పుకుంటారా అన్న చర్చ సాగుతోంది. కొందరైతే బీఆర్ఎస్ సీటు రాకుంటే జూపల్లి స్వతంత్రంగానే బరిలో దిగుతారని చెబుతున్నారు.
తాను మంత్రిగా, ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి చేసిన అభివృద్ది, తెలంగాణ సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్న తీరును వివరిస్తూ క్యాలెండర్లు, కరపత్రాలు ముద్రించి నియోజకవర్గంలో పంపిణీ చేస్తున్నారు. ఫాంహౌస్ కేసును, తక్కువగా రావాల్సిన బిల్లును పార్టీ మారి భారీగా సొమ్ము చేసుకున్నాడని సిటింగ్ ఎమ్మెల్యేపై జూపల్లి విమర్శలు చేస్తున్నారు. ఆత్మీయసమ్మేళనాలు నిర్వహిస్తూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న జూపల్లి పార్టీ అంతా తన వెనకే ఉందని భావిస్తున్నారు. తాను పదవిలో ఉన్నప్పుడు నియోజకవర్గానికి 3 వందల కోట్ల నిధులు తెచ్చానని.. ఆ పనుల్ని ఈ ఎమ్మెల్యే ఎందుకు పూర్తి చేయించలేదని ప్రశ్నిస్తున్నారు.
ఆరోపణలేంటీ? జవాబులేంటీ?
హర్షవర్థన్‌రెడ్డి మాత్రం తాను నియోజకవర్గ అభివృద్దే ద్యేయంగా పనిచేస్తున్నానని చెబుతున్నారు. సోమశిలసిద్దేశ్వరం వంతెన, రెవెన్యూ డివిజన్ సాధించానని దీంతో ఇక్కడి ప్రజల చిరకాల కోరిక నెరవేరటంతోపాటు ఈ ప్రాంతం అభివృద్ది చెందేందుకు దోహదపడుతుందని అంటున్నారు. గోపాల్దిన్నె లింక్ కెనాల్ సాధించానని చెబుతున్నారు. జూపల్లి రాజకీయలబ్ది కోసమే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే అంటున్నారు. అయితే జీఓ 98 ప్రకారం శ్రీశైలం ముంపు నిర్వాసితులకు ఉద్యోగాలు ఇప్పిస్తానన్న హామీ నెరవేర్చటంలో ఎమ్మెల్యే వైఫల్యం చెందాడనే ఆరోపణలు ఉన్నాయి.
నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మాణం కూడా జరగకపోవటం, కొల్లాపూర్లో వంద పడకల ఆస్పత్రి నిర్మాణం జరగకపోవటం, మాదాసి కురువలను ఎస్సీలుగా, వాల్మీకిబోయలను ఎస్టీలుగా గుర్తించేందుకు కృషి చేస్తానంటూ ఇచ్చిన హమీలు నెరవేరకపోవటంతో ఆయా వర్గాలు ఎమ్మెల్యేపై అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్యే అనుచరులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణాలో ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. తన అనుచరులకే ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారని ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నారు.
సొంతగూటికి వస్తారా?
ఫాంహౌజ్ వ్యవహారంలో ఎమ్మెల్యే హర్షవర్థన్‌రెడ్డి కూడ ఉండటం దుమారం రేపింది. ఇప్పటికే డబ్బులు తీసుకుని కాంగ్రేస్ నుంచి టీఆర్ఎస్‌కి మారాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేకు ఫాంహౌజ్ ఎపిసోడ్ సంకటంగా మారింది. జూపల్లి మాత్రం తనను ఎదుర్కోలేక డబ్బులకు అమ్ముడుపోయి ఎమ్మెల్యే పార్టీ మారాడని ఆరోపిస్తున్నారు. అభివృద్ది కోసమే పార్టీ మారినట్టు చెబుతున్న ఎమ్మెల్యే ఏం అభివృద్ది సాధించాడో చెప్పాలని నిలదీస్తున్నారు జూపల్లి కృష్ణారావు. హర్షవర్థన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి పార్టీని వీడిన తర్వాత కాంగ్రెస్ నియోజకవర్గంలో బలమైన నాయకత్వం కరువయ్యింది.
దీంతో గత ఏడాది చివరిలో జగదీశ్వర్‌రావు బీఆర్ఎస్ పార్టీని వీడి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రస్‌లో చేరారు. ఈసారి కాంగ్రేస్ పార్టీ నుంచి జగదీశ్వర్‌రావు పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగంలో పనిచేసిన రంగినేని అభిలాష్రావు కూడ కాంగ్రేస్లో చేరారు. ఈయన కూడ సీటు ఆశిస్తున్నారు. వీరిద్దరి మద్య కూడ అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. ఒకవేళ జూపల్లి సొంతగూటికి వస్తే.. అప్పుడు సీటు ఆయనకు కేటాయిస్తే వీరిద్దరు జూపల్లికి ఏ మేరకు సహకరిస్తారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రేస్ సీటు విషయంలో గందరగోళం రేగితే బీఆర్ఎస్కు మేలు జరిగే అవకాశం ఉంది.
జూపల్లిపై కన్ను
బీజేపీ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎల్లెని సుధాకర్రావు నియోజకవర్గ ఇంచార్జీగా కొనసాగుతున్నారు. ఆయన గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటున్న నేపధ్యంలో తనకు మేలు జరుగుతుందనే భావనలో ఉన్నారు సుధాకర్రావు. కేంద్రప్రభుత్వం కృష్ణానదిపై సోమశిలసిద్దేశ్వరంను కలుపుతూ బ్రిడ్జి మంజూరు చేయడం వెనుక తన కృషి చాలా ఉందని..అందువల్ల ఈసారి తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తానని అంటున్నారు. ఇటీవల ఆయన నియోజవర్గంలో పాదయాత్ర నిర్వహించి ముగింపు సభకు బండి సంజయ్ ఆహ్వానించి పార్టీ క్యాడర్లో జోష్ నింపారు.
అయితే నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా క్యాడర్ లేకపోవటం మైనస్‌గా ఉంది. సుధాకర్‌రావు మాత్రం పార్టీ కార్యక్రమాలు విధిగా నిర్వహిస్తూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. ఈయనకు కూడ జూపల్లి నుంచి ప్రమాదం పొంచి ఉంది. జూపల్లి బీజేపీలో చేరి సీటు ఎగురేసుకుపోతే సుధాకర్‌రావు పరిస్ధితి ఏంటనేది ప్రశ్నార్దకంగా మారింది. మాజీ మంత్రి, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావుకు గులాబీ పార్టీ సీటివ్వకపోతే...తమకు ఎక్కడ ఎర్త్ పెడతాడోనని అటు కాంగ్రెస్...ఇటు బీజేపీలోని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment