ఖైరతాబాద్(హైదరాబాద్): హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాల్సిందిగా 120 బీసీ సంఘాలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. అయితే కొందరు వ్యక్తులు, సంఘాల నేతలు ఈ అంశంపై అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు.
టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నందుకు తాము అనేక కారణాలు చెప్పగలమని, ఈటల రాజేందర్‌కు మీరు మద్దతు ఇవ్వడానిగల కారణాలు చెప్పగలరా అని ఆయన సవాలు చేశారు. గురువారం కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ బీసీబంధు పథకం పెట్టాలని, ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని తాము రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశామని, అదే రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించి బీసీబంధు పథకంపై సానుకూలత వ్యక్తం చేశారని, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామని ప్రకటించారని తెలిపారు.
బీసీల అభ్యున్నతికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, అందుకే టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు మద్దతు ఇస్తున్నామని స్పష్టంచేశారు. జనగణనలో బీసీలను లెక్కించడానికి ఒప్పుకోని బీజేపీ, దేశంలోని 70 కోట్లమంది బీసీలను ఎలా అభివృద్ధి చేస్తుందని ప్రశ్నించారు. బీజేపీ బీసీ వ్యతిరేక వైఖరి మానుకోవాలని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment