Telangana: KTR Lashes Out At BJP For Body Shaming Son - Sakshi
Sakshi News home page

హిమాన్షుపై అసహ్యమైన రాజకీయవ్యాఖ్యలు చేయడం సంస్కారమేనా?

Published Sat, Dec 25 2021 2:54 AM | Last Updated on Sat, Dec 25 2021 2:16 PM

Telangana: KTR Lashes Out At BJP For Body Shaming Son - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘బీజేపీ ప్రచారకర్తల ముసుగులో ఉన్న దిగజారుడు నేతలకు, అలాంటి నేతలకు ప్రాచుర్యం ఇచ్చే మీడియాకు దూరంగా ఉండండి. ప్రత్యేకించి నా పిల్లల మీద నేరస్వభావం కలిగిన చెత్తవ్యాఖ్యలు చేస్తున్నతీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మేం కూడా అదేస్థాయిలో స్పందించాల్సిన స్థితి వస్తే మమ్ము లను నిందించొద్దు’అని రాష్ట్రమంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన కుమారుడు హిమాన్షును ఉద్దేశిస్తూ బీజేపీనేత తీన్మార్‌ మల్లన్నకు చెందిన క్యూన్యూస్‌ నిర్వహించిన ఓ ఒపీనియన్‌ పోల్‌పై ఓ నెటిజన్‌ చేసిన వ్యాఖ్యానాన్ని ఉద్దేశించి ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘తెలంగాణలో మీ బీజేపీ నేతలకు నేర్పిస్తున్నది ఇదేనా? నా కుమారుడి శరీరాకృతిపై బీజేపీ ప్రచారకర్తలు అసహ్యమైన రాజకీయవ్యాఖ్యలు చేయడం సంస్కారమేనా? అమిత్‌ షా లేక ప్రధాని మోదీలతోపాటు వారి కుటుంబాన్ని ఉద్దేశించి మేమూ మీలాగే మాట్లాడలేమనుకుంటున్నారా? ప్రజాజీవితంలో ఉండటం సరైనదేనా అని చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది.

ప్రత్యేకించి ప్రస్తుత సోషల్‌ మీడియా యుగంలో ఎవరైనా ఎలాంటి నిందలైనా వేయొచ్చా. జర్నలిజం ముసుగులో యూట్యూబ్‌ చానళ్ల ద్వారా పనికిమాలిన చెత్తను ప్రసారం చేస్తూ పిల్లలను కూడా ఈ మురికిలోకి లాగు తారా? భావప్రకటన స్వేచ్ఛ ముసుగులో దురదృష్టవశాత్తూ తిట్లు, బురదచల్లడం ఓ హక్కుగా మారి నట్లుంది. సోషల్‌ మీడియా జర్నలిజం ముసుగులో దుష్ప్రచారం, చెత్తను ప్రసారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. సోషల్‌ మీడియా సంఘ వ్యతిరేకశక్తులకు స్వర్గంగా తయారైంది’అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

కారణాలు లేనప్పుడు కుటుంబమే వారి లక్ష్యం: కవిత 
‘నీ ప్రతిష్టను దిగజార్చేందుకు వాళ్ల దగ్గర కారణాలు లేనప్పుడు నీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటారని తెలుసు కదా. సోషల్‌ మీడియా వేదికల మీద కనీసం సున్నితంగా, బాధ్యతగా ఉండటం మాత్రమే మనం చేయగలిగింది. చాలాకాలంగా సోషల్‌ మీడియా ద్వారా విద్వేషాన్ని, అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నవారు సిగ్గుపడాలి’అని కేటీఅర్‌ ట్వీట్‌కు ఆయన సోదరి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement