వేదికపై ఎమ్మెల్యే కుర్చీకి పూల దండ వేస్తున్న ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/హుజూరాబాద్: ‘ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓ బ్రోకర్. నియోజకవర్గం అభివృద్ధిపై చర్చకు రమ్మంటే రాకుండా పారిపోయిన దద్దమ్మ’అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. ‘ఈటల హుజూరాబాద్‌లో ఓట్ల కోసం యాక్టర్, హైదరాబాద్‌లో జోకర్, ఢిల్లీలో బ్రోకర్’అని ఎద్దేవా చేశారు. రాజేందర్ పెద్ద బ్రోకర్ అన్న సంగతిని బీజేపీ జాతీయ నేతలు గుర్తించి దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో చేరికల కమిటీకి ఆయన్ను చైర్మన్‌గా చేశారన్నారు.
శుక్రవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో నియోజకవర్గం అభివృద్ధిపై ఈటల చర్చకు రావాలని ఏర్పాటు చేసిన వేదికపైనుంచి కౌశిక్ మాట్లాడారు. 18 ఏళ్లు ఎమ్మెల్యే, ఏడున్నరేళ్లు మంత్రిగా పనిచేసిన ఈటల తన సొంతూరు కమలాపూర్‌కు కనీసం బస్టాండ్, శ్మశానవాటిక కట్టించలేకపోయారని విమర్శించారు. కేసీఆర్‌ను బీజేపీ నేతలు తూలనాడితే సహించబోమని, వారిని బట్టలూడదీసి తరిమికొడతామని హెచ్చరించారు.
తనది కౌశిక్‌రెడ్డి స్థాయి కాదన్న రాజేందర్.. తాను ఎమ్మెల్సీనన్న సంగతి మర్చిపోయారని, ప్రొటోకాల్ ప్రకారం తన కంటే ఈటల చిన్న అని ఎద్దేవా చేశారు. అనంతరం రాజేందర్ కోసం వేదికపై ఏర్పాటు చేసిన కుర్చీకి కౌశిక్‌రెడ్డి దండ వేసి నిరసన తెలిపారు. కాగా, కౌశిక్‌రెడ్డి వేదిక మీదకు రాగానే మహిళా మోర్చానేతలు బీజేపీ అనుకూల నినాదాలు చేయడంతో పోలీసులు కలగజేసుకుని అక్కడ నుంచి పంపించేశారు. సభ అనంతరం బీజేపీ నేతలు అక్కడికి రావడంతో కాసేపు తోపులాట, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment