సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో లోక్‌సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో జాతీయస్థాయిలో హేమాహేమీలైన పలువురు నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ కోసం ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాం«దీలు సైతం గ్రేటర్‌లో ప్రచార షోలు నిర్వహించారు. మహా నగర పరిధిలోని నాలుగింట మూడు స్థానాల్లో గెలిచి బీజేపీ తన హవా చాటుకుంది.
హైదరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన మాధవీలత పాతబస్తీలో ప్రచారంతో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. ఎప్పటిలాగే హైదరాబాద్ ఎంపీగా ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ (ఐదోసారి) గెలవగా, సికింద్రాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి సిట్టింగ్ సీటును నిలుపుకున్నారు. మరోమారు కేంద్రమంత్రి అయ్యారు. దేశంలోనే అత్యధిక ఓట్లున్న మల్కాజిగిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ గెలుపొందారు. చేవెళ్ల నుంచి అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపొందారు.
రిక్త ‘హస్తం’
రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి సిట్టింగ్ స్థానాన్ని తిరిగి గెలవలేకపోయింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన ఆ నియోజకవర్గంలో తిరిగి కాంగ్రెస్ జెండా ఎగరలేదు. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ల నుంచి పోటీ చేసిన ఆపార్టీ అభ్యర్థులు గడ్డం రంజిత్‌రెడ్డి, సునీతా మహేందర్‌రెడ్డి, దానం నాగేందర్‌లు సైతం ఓటమి పాలయ్యారు.
వాడిన గులాబీ..
అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీఆర్‌ఎస్ ఒక్క ఎంపీ సీటును కూడా దక్కించుకోలేకపోయింది. సికింద్రాబాద్ స్థానానికి సీనియర్ ఎమ్మెల్యే పద్మారావును బరిలో దింపినా ఫలితం లేకుండా పోయింది. మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన రాగిడి లక్ష్మారెడ్డి, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ఓటమి పాలయ్యారు.
ఎమ్మెల్యేలుగానే మిగిలారు..
కిషన్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను బరిలో దింపినా బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు సికింద్రాబాద్‌లో గెలవలేకపోయాయి. పార్టీ మారి బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన దానం నాగేందర్, బీఆర్‌ఎస్ నుంచి నిలబడ్డ పద్మారావులు గెలవలేకపోయారు.
కాంగ్రెస్ ఖాతాలో కంటోన్మెంట్
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో జరిగిన ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ నుంచి ఆమె సోదరి నివేదిత, బీజేపీ నుంచి బరిలో నిలిచిన వంశీ తిలక్ గెలవలేకపోయారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన శ్రీగణేశ్ గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment