సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం సాగిస్తామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు, నేతలతో కూడిన విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడేళ్ల మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పాలనలో దేశంలోని ఏ రంగం కూడా బలపడింది లేదని, వ్యవసాయ రంగంపై కేంద్ర నిర్ణయాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ఏ పథకంలోనూ అణా పైసా కేంద్ర ప్రభుత్వానిది లేదని చెప్పారు. ‘కాళేశ్వరం’ప్రాజెక్టును పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర నిధులతో నిర్మించుకున్నదని కేంద్రమంత్రే పార్లమెంటులో వెల్లడించారని అన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం తీరుపై పార్లమెంట్ లోపలా, బయటా టీఆర్‌ఎస్ ఎంపీలు పోరాడినా వారి ఆందోళనల పట్ల కేంద్రం అమానుషంగా, అమర్యాదకరంగా మాట్లాడిందని విమర్శించారు.
పార్లమెంట్ వేదికగా కేంద్ర మంత్రులు చెప్పిన అబద్దాలపై నిలదీసేందుకు మంత్రుల బృందం శనివారం ఢిల్లీకి వెళుతుందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ దాదాపుగా పూర్తయిందని, మిగిలిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని కోరేందుకు ఢిల్లీకి వెళుతున్నట్లు చెప్పారు. గతంలో వానాకాలం పంటనంతా కొంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చారన్నారు. ఎఫ్‌సీఐ, గోదాంలు, రైళ్లు కేంద్రం అధీనంలోనే ఉన్నాయని.. వాళ్ల బియ్యం వాళ్లు తీసుకెళ్లకుండా రాష్ట్రం పంపలేదని చెప్పడం అవగాహనా రాహిత్యమని వెల్లడించారు.
వ్యవసాయాధికారులు రైతుబంధు విషయంలో చేసిన సూచనను సీఎం కేసీఆర్ తిరస్కరించారన్నారు. శాసనసభ సాక్షిగా రైతుబంధును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని ఇచ్చిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని కేసీఆర్ చెప్పారని తెలిపారు. తెలంగాణ రైతులు పరిస్థితిని అర్ధం చేసుకుని ఆరుతడి పంటలు వేస్తున్నారని వివరించారు. వేరుశనగ, పప్పు శనగ 5 లక్షల ఎకరాల చొప్పన సాగయిందని.. మినుములు, పెసలు, ఆవాలు, నువ్వులు, మక్కలు కూడా వేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్ రెడ్డి, ఎంపీ కేశవరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment