రాష్ట్ర బీజేపీ నేతల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్. చిత్రంలో డీకే అరుణ, కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో వరుస ఓటములతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేశానికి గురై ఆందోళన చెందుతున్నారని, అందుకే తెలంగాణ రైతులకు, రాష్ట్ర ప్రజలకు సమస్యలు సృష్టించే పనిలో ఉన్నారని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం ప్రకారం గత రబీకి సంబంధించి ఎఫ్‌సీఐకి అందించాల్సిన 27 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వకుండా, వారి చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు తప్పుడు మాటలు మాట్లాడుతూ రాష్ట్ర రైతులను, ప్రజలను భ్రమలకు గురి చేస్తున్నారని అన్నారు.
ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన 27 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తప్పనిసరిగా తెలంగాణకు చెందిన రబీ పంటే అయి ఉండాలని, బయటి రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అందిస్తామంటే కుదరదని తేల్చి చెప్పారు. ఒప్పందం ప్రకారం ఉండాల్సిన నాణ్యత విషయంలోనూ తాము ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేశారు.
మంగళవారం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటల రాజేందర్, విజయశాంతి, వివేక్, విఠల్‌తో పాటు పలువురు తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీలోని ఉద్యోగ్‌భవన్‌లో గోయల్‌ను కలిశారు. ధాన్యం సేకరణ విషయంలో టీఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం గోయల్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ అభివృద్ధిపై ప్రధాని దృష్టి
తెలంగాణ ప్రభుత్వం అనేక అబద్ధాలు చెబుతూ రైతులను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. తెలంగాణ రైతులను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రధాని మోదీ ఉన్నారని చెప్పారు. కేంద్రం నుంచి ఎంత సాయం అవసరమైతే అంత అందిస్తున్నామన్నారు. గత ఐదేళ్ళలో తెలంగాణలో మొత్తం ఐదు రెట్లు అధికంగా ధాన్యం సేకరణ జరిగిందని వెల్లడించారు.
దేశంలో పారా బాయిల్డ్ బియ్యం ఎవరూ తినకపోయినప్పటికీ, తెలంగాణ రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని గత రబీలో చేసుకున్న ఒప్పందానికి అదనంగా మరో 20 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ బియ్యం తీసుకొనేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. అయితే గత రబీకి సంబంధించిన 14 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ బియ్యం, 13 లక్షల మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేకపోయిందన్నారు.
నాలుగుసార్లు గడువు పొడిగించినా ఎఫ్‌సీఐకి సేకరించి ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఈ గణాంకాలు చూస్తే తెలంగాణ ప్రభుత్వం రైతులను ఎలా మోసం చేస్తుందో తెలు స్తుందని గోయల్ వ్యాఖ్యానించారు. గతంలో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని సేకరించి అందించాలని కోరారు.
వారికేమీ పనిలేదా?
తెలంగాణ మంత్రులను ఢిల్లీకి రమ్మని తాను చెప్పలేదని గోయల్ అన్నారు. ఎవరి పనుల్లో వారు బిజీ గా ఉన్నారని, ఇలాంటి సమయంలో వారికేమీ పనిలేదా?అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రైతులు రాష్ట్రప్రభుత్వం గురించే ఆందోళన చెందాలన్నారు.
ముడి బియ్యం ఎంతైనా తీసుకుంటాం
ప్రస్తుతం దేశంలో డిమాండ్ ఉన్న రకం బియ్యాన్ని ఇవ్వాల్సిందిగా రాష్ట్రాలకు చెబుతున్నామని, తెలంగాణ నుంచి కూడా ఎంత ముడి బియ్యం ఇచ్చినా తీసుకొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గోయల్ స్పష్టంచేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి ఆరోపించారు.
తనపై, కిషన్‌రెడ్డిపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, నిందలను ఖండిస్తున్నానన్నారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు సంబంధించి గోడౌన్ల లభ్యత లేదన్న మాట నిజం కాదని, దీనిపై ఎలాంటి పత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని ఆయన వెల్లడించారు.
బియ్యం ఎందుకు ఇవ్వట్లేదు?
రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన బియ్యం ఇప్పటికీ ఎందుకివ్వట్లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం వల్లే రబీ టార్గెట్ పూర్తి చేయలేదని చెప్పారు. ధాన్యం సేకరణ మొత్తం ఖర్చు కేంద్రానిదే అయినప్పటికీ, కేసీఆర్ కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్ ఓటమి తర్వాతే కేసీఆర్ బియ్యం అంశాన్ని ఎత్తుకున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment