
సాక్షి, మహబూబాబాద్: బంగారు తెలంగాణ చేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను బార్లు, బీర్ల తెలంగాణగా మార్చారని వైఎస్‌ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దుయ్యబట్టారు. మంగళవారం ఆమె ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో పర్యటించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ముత్యాలసాగర్ కుటుంబసభ్యులతో కలిసి కొత్త ఇరుసులాపురం గ్రామంలో నిరుద్యోగ దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004–2008 వరకు వరుస డీఎస్సీలువేసి 50 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారని చెప్పారు. కానీ కేసీఆర్ నిరుద్యోగుల ఉసురు పోసుకుంటూ ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయడం లేదని, ఇదిగో అదిగో అంటూ ఊరిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో అందరు ధర్నాలు జంతర్‌మంతర్, ఇతర ప్రధాన కూడళ్ల వద్ద చేస్తారని.. కేసీఆర్ మాత్రం తెలంగాణ భవన్‌లో చేసి తన ఫామ్‌హౌస్ పద్ధతిని ప్రదర్శించారని విమర్శించారు. ఢిల్లీలో కేసీఆర్ పీఎం, ఇతర మంత్రులు, ఎఫ్‌సీఐ అధికారులను కూడా కలవలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment