సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్లాన్ చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక, ఇప్పటికే మొదటి జాబితాలను విడుదల చేసిన హస్తం పార్టీ.. రెండో జాబితాపై తర్జనభర్జన పడుతోంది. అయితే, అభ్యర్థుల జాబితా కసరత్తు తుది దశకు చేరినట్టు తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ రెండో జాబితా ఏ క్షణంలోనైనా విడుదలయ్యే అవకాశముంది. ఇందులో భాగంగానే రేపు(శుక్రవారం) ఉదయం 9.30కు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. అన్ని స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేయనుంది. ఇక, తెలంగాణ కాంగ్రెస్‌లో ఐదు సీట్లలో హోరాహోరి పోటీ నెలకొంది. సంక్లిష్ట స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేయనుంది. కాగా, అభ్యర్థుల ఎంపిక ఒక నియోజకవర్గంతో మరో నియోజకవర్గం ముడిపడి ఉంది.
హోరాహోరీ స్థానాలు ఇవే..
1. బోథ్: డాక్టర్ నరేష్ జాదవ్ / రాథోడ్ బాపురావు
2. తుంగతుర్తి: అద్దంకి దయాకర్ / డాక్టర్ వడ్డేపల్లి రవి
3. మహేశ్వరం: కిచ్చేన గారి లక్ష్మారెడ్డి / పారిజాతా రెడ్డి
4. జడ్చర్ల: ఎర్ర శేఖర్ / అనిరుధ్ రెడ్డి
5. మక్తల్: శ్రీహరి / ప్రశాంత్ రెడ్డి.
అయితే, మక్తల్ సీటు బీసీకి ఇస్తే జడ్చర్ల సీటు రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే, మక్తల్ నుంచి సీటు ఆశిస్తున్న శ్రీహరి ముదిరాజ్, జడ్చర్ల నుంచి ఎర్ర శేఖర్ ముదిరాజ్ టికెట్ ఆశిస్తున్నారు. తాండూరు టికెట్ మనోహర్ రెడ్డికి, మహేశ్వరం టికెట్ కేఎల్ఆర్‌కి వచ్చే అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment