మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి తాటికొండ రాజయ్య.. కడియంకు చెక్‌ పెట్టేందుకు! | Thatikonda Rajaiah U-Turn, Wants To ReJoin In BRS After Kadiyam Step Out | Sakshi
Sakshi News home page

మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి తాటికొండ రాజయ్య.. కడియంకు చెక్‌ పెట్టేందుకు!

Published Fri, Mar 29 2024 5:17 PM | Last Updated on Fri, Mar 29 2024 5:41 PM

Thatikonda rajaiah U Turn Wants To ReJoin In BRS After Kadiyam Step - Sakshi

లోక్‌సభ ఎన్నికల ముంగిట తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల వేళ రాజకీయ వలస పక్షులు పార్టీలు మారుతున్నాయి. సీట్ల కోసం, అధికారం కోసం నేతలు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు దూకేస్తున్నారు. కండువాలు మార్చేందుకు కాఫీ తాగినంత టైం కూడా తీసుకోవడం లేదు. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ నుంచి జంపింగ్ జపాంగుల పర్వం జోరందుకుంది

తాజాగా వరంగల్‌కు బీఆర్‌ఎస్‌కు చెందిన ఓ కీలక నేత పార్టీని వీడితే మరో ముఖ్య నేత మరోసారి చేరేందుకు సిద్దమయ్యారు. అసెంబ్లీ టికెట్‌ దక్కపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీకి చేసిన రాజీనామాను ఉపసంహరించుకోబోతున్నట్లుగా సమాచారం.

ఇప్పటికే రాజయ్యతో హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ నేతలు టచ్‌లోకి వెళ్లారు. శనివారం సాయంత్రం రాజయ్య నేరుగా కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ఒకవేళ కడియం శ్రీహరి వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తే.. ఆయన మీద పోటీగా రాజయ్యను బరిలోకి దింపేందుకు బీఆర్‌ఎస్‌ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే పార్టీలో చేరికపై తన కార్యకర్తలతో చర్చించి చెబుతానని రాజయ్య చెప్పినట్లు సమాచారం.
చదవండి: కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్నా వాళ్లను మళ్లీ పార్టీలో చేర్చుకోం: కేటీఆర్‌

కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజయ్య రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు. కానీ  కాంగ్రెస్‌లో చేరలేదు. మరోవైపు ఆయన రాజీనామాను కూడా కేసీఆర్ ఆమోదించలేదు.

మరోవైపు అనూహ్యంగా వరంగల్ ఎంపీ స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య ప్రకటించారు. తండ్రితో కలిసి ఆమె కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ తాజా నేపథ్యంలో తిరిగి రాజయ్య పేరు తెరపైకి వచ్చింది. తన ప్రత్యర్ధి ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరనుండటంతో మళ్లీ సొంతగూటికి వచ్చేందుకు రాజయ్య సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తాడికొండ రాజయ్యను ఎంపిక చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement