
తిరుపతి, సాక్షి: తిరుమల స్వామివారి లడ్డూను వాడుకుని రాజకీయం చేద్దామనుకున్న నారా చంద్రబాబు నాయుడి ప్రయత్నం బెడిసి కొట్టిందని వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తమపై వేసిన అపవాదుకు ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని ప్రకటించారాయన.
జూలై 17 టీటీడీ ఈవో శ్యామల రావు చాలా స్పష్టంగా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎడిడబుల్ ఆయిల్ ఉంది అని స్పష్టంగా చెప్పారు. అయినా.. కేవలం ప్రత్యర్ధి పార్టీను దెబ్బ తీయాలని ఉద్దేశంతో చంద్రబాబు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పుడు మరింత రెచ్చిపోయి.. ఎన్డీడీబీ(National Dairy Development Board) ఫేక్ రిపోర్ట్ ఇచ్చి జాతీయ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు.

నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు . ఈ ఆరోపణలపై అధికారులు కాకుండా స్వయంగా చంద్రబాబే ఎందుకు మాట్లాడుతున్నారు?. చంద్రబాబు సర్కార్‌కు మేం చాలెంజ్ చేస్తున్నాం. మా మీద పడిన అపవాదుపై విచారణకు సిద్ధంగా ఉన్నాం. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. అవసరమైతే.. సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం.
టీటీడీ ప్రతిష్ఠ ను దిగజార్చడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. మీ అసలు విష స్వరూపం బయట పడింది. హిందువులందరినీ చంద్రబాబు అవమానించారు. ఆయన తక్షణమే హిందూ జాతికు క్షమాపణ చెప్పాలి.

చంద్రబాబు జీవితం అంతా అబద్ధపు హామీలే. రాజకీయంగా ఎదగడానికి ఎన్నో కుయుక్తులు, కుట్రలు చేశారు.. ఇంకా చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అడ్డు పెట్టుకుని.. జగన్ మోహన్ రెడ్డిని బద్నాం చేయాలన్న ప్రయత్నం వికటించింది. స్వామి ప్రతిష్ఠకు భంగం కలుగుతుందనే బాధతో మేం ఉన్నాం. ఆ భగవంతుడే మీకు తగిన బుద్ధి చెప్తాడు చంద్రబాబూ.. అని భూమన అన్నారు.
ఇదీ చదవండి: ఆవు నెయ్యి.. టీడీపీకి గొయ్యి!