సాక్షి, తాడేపల్లి: ఏపీ ప్రజలు వరదల్లో అల్లాడి పోతుంటే సీఎం చంద్రబాబు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. వరద్లలో ప్రజల మరణాలకు చంద్రబాబే కారణం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాగా, టీజేఆర్ సుధాకర్ బాబు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు కొంచెం కూడా బాధ్యత లేదు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, చంద్రబాబు ఒకరిని ఒకరు మెచ్చుకుంటూ కాలం గడిపారు. ఆగస్టు 28వ తేదీనే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించినా చంద్రబాబు పట్టించుకోలేదు. వెలగలేరు వద్ద గేట్లు ఎత్తాలని అధికారులు చెప్పినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు?. ఆ సమయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలను కొనుగోలు చేయటం, ముంబై నటి వ్యవహారాల మీదనే చంద్రబాబు దృష్టి పెట్టారు.
సరైన సమయంలో ఎలాంటి నిర్ణయంలో తీసుకోకపోవడం వల్లే ప్రజల అవస్థలకు కారణమయ్యారు. వరదల్లో మరణాలకు చంద్రబాబే కారణం. బుడమేరు ఆధునికీకరణ పనులను చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు?. టీడీపీ నేతలకు చెందిన భూములు పోతాయనే కారణంగానే భూసేకరణ కూడా చేయలేదు. ఏబీఎన్ రాధాకృష్ణకు చెందిన పవర్ ప్రాజెక్టుకి నష్టం జరుగుతుందనే వరద నీటిని జనం మీదకు వదిలారు. రోజూ చంద్రబాబు అధికారులను వెంటేసుకుని తిరగటం వలనే సహాయ చర్యలు జరగటం లేదు. రాజకీయ క్రీడలను టీడీపీ నేతలు ఆపాలి. అధికార అహంకారంతో మంత్రులు వ్యవహరించవద్దు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.
వరదల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు మళ్ళీ వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. అందులో భాగమే నందిగం సురేష్‌ను అరెస్టు చేశారు. ఇలాంటివి ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొంటాం. డైవర్షన్ రాజకీయాలు ఆపి బుడమేరు ముంపు ఎలా తప్పించాలో ఆలోచించండి. వరద రాకముందే చంద్రబాబు సురక్షిత ప్రాంతానికి వెళ్లి తలదాచుకున్నారు. మరి జనాన్ని ఎందుకు సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు?. వరదకంటే ముందే పవన్ కళ్యాణ్, లోకేష్ హైదరాబాద్ వెళ్లిపోయారు. వారికి బాధ్యత అనేదే లేదా?. అపార అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు.. ఇన్ని రోజులుగా వరద సహాయ చర్యలు ఎందుకు చేపట్టలేదు? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment