
ప్లీనరీలో మాట్లాడుతున్న ప్రొఫెసర్ కోదండరాం
సంగారెడ్డి అర్బన్: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని సీఎం కేసీఆర్‌కు ప్రగతి భవన్ జైలు ఖానా అయ్యిందని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం సంగారెడ్డిలో టీజేఎస్ ద్వితీయ ప్లీనరీని జిల్లా అధ్యక్షుడు తుల్జారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోదండరాం మాట్లాడుతూ ప్రగతి భవన్ పాలన కొనసాగడం విడ్డూరంగా ఉందన్నారు.
పేదల భూములు దోచి పెద్దలకు అప్పగించడం సరికాదన్నారు. పరిశ్రమల ముసుగులో ప్రభుత్వం భూముల అక్రమ దందా చేస్తోందని, నిమ్జ్ భూసేకరణను ఆపాలని డిమాండ్ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యా యని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎత్తిపోతల కంటే 10 వేల ఎకరాలు నీట మునగడం బాధాకరమన్నారు.
సింగరేణి, ఎన్టీపీసీ కాలుష్యం, బూడిదతో నీళ్లు కలుషితం కావడంతో ఆ ప్రాంత ప్రజలు కిడ్నీ, ఉదరకోశ వ్యాధులతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు అప్పగించడం సరికాదన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పరాయివాళ్లమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం మందకృష్ణ మాదిగ, ప్రొఫెసర్ హరగోపాల్‌తో కలిసి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment