చంద్రబాబును సీబీఐ, ఈడీ ఎందుకు అరెస్టు చేయలేదు?: ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ |TMC MP Kalyan Banerjee Sensational Comments On Chandrababu In Lok Sabha, More Details Inside | Sakshi
Sakshi News home page

చంద్రబాబును సీబీఐ, ఈడీ ఎందుకు అరెస్టు చేయలేదు?: ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ

Published Wed, Jul 3 2024 5:28 AM | Last Updated on Wed, Jul 3 2024 12:01 PM

TMC MP Kalyan Banerjee On Chandrababu in Lok Sabha

ఎన్డీఏలో చేరగానే టీడీపీ అధినేత శుద్ధపురుషుడు అయ్యాడా? 

విశ్వసనీయతలేని, అవినీతిపరులైన నేతలను మోదీ కలుపుకొన్నారు 

ఎగ్జిట్‌ పోల్‌ ప్రచారంతో స్టాక్‌ మార్కెట్‌ను ప్రభావితం చేశారు 

లోక్‌సభలో టీఎంసీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ

సాక్షి, న్యూఢిల్లీ: విశ్వసనీయత లేని, అవినీతిపరులైన నేతల అండతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ విమర్శించారు. అవినీతిపరులైన నేతలు ఎన్డీఏలో చేరగానే శుద్ధపురుషులు అయ్యారా అంటూ నిలదీశారు. కేంద్రంలో ప్రస్తుతం అస్థిరమైన ప్రభుత్వం పాలన చేస్తుంటే ఇంకోవైపు అత్యంత పటిష్టమైన ప్రతిపక్షం ఉందని అన్నారు. మంగళవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో కల్యాణ్‌ బెనర్జీ మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ, జేడీయూల ప్రస్తావన తెచ్చారు. 

గతంలో స్థిరమైన ప్రభుత్వంతో నిబ్బరంగా కనిపించిన ప్రధాని మోదీ ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ అనే ఊతకర్రల సాయంతో సభలోకి వస్తున్నారు అని ఎద్దేవా చేశారు. ఆ రెండు కర్రలు పట్టుకునే దేశవిదేశాల్లో మోదీ తిరుగుతున్నారని చెప్పారు. గతంలోలాగా ప్రధాని మోదీలో ఆత్మస్థైర్యం కనిపించడం లేదు అని అన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష రాజకీయ నేతలపై సీబీఐ, ఈడీ దాడులను ప్రస్తావించిన బెనర్జీ, ఎన్డీఏ పక్షాల నేతలపై కేసుల అంశాన్ని తూర్పారపట్టారు. 

అవినీతిపరులంతా కూటమి కట్టారని ఇండియా కూటమిపై గతంలో మోదీ పదేపదే ఆరోపణలు చేశారని, మరి చంద్రబాబు, అజిత్‌ పవార్, ప్రఫుల్లపటేల్‌ల విషయంలో జరిగిందేమిటీ అని ప్రశ్నించారు. వీరిపై కేసులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. సీబీఐ, ఈడీలు చంద్రబాబును అరెస్ట్‌ చేస్తాయా అని నిలదీశారు. టీడీపీ అధినేతను ఎందుకు సీబీఐ, ఈడీ అరెస్ట్‌ చేయలేదు అని ప్రశ్నించారు. బీజేపీ పంచన చేరగానే వాషింగ్‌ మెషీన్‌లో వేసిన మాదిరి వారంతా సుద్ధపురుషులు అయ్యారంటూ ఎద్దేవా చేశారు. అవినీతిపరులైన నేతలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అగత్యం మోదీ ప్రభుత్వానికి ఏర్పడిందని దుయ్యబట్టారు.  

ఆ కంపెనీకి లాభాలు ఎలా వచ్చాయి.. 
ఎన్నికల సర్వేల అంశాలపై కల్యాణ్‌ బెనర్జీ మాట్లాడుతూ.. బీజేపీ కూటమి 400 సీట్లు దాటుతుందంటూ ఎగ్జిట్‌ పోల్‌ సర్వేల ద్వారా ప్రచారం చేసి, స్టాక్‌మార్కెట్‌లో షేర్‌లు కొనాలని ప్రోత్సహించారని విమర్శించారు. ఫలితాల రోజున ఒకపైపు స్టాక్‌మార్కెట్‌ పడిపోయి రూ. 31 లక్షల కోట్లు మదుపరుల సంపద ఆవిరైపోతే, టీడీపీ అగ్రనేత భార్యకు చెందిన కంపెనీ మాత్రం రూ. 521 కోట్లు ఆ ఒక్కరోజులోనే ఆర్జించింది వెల్లడించారు. ఇదెలా సాధ్యమైందని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని నిలదీశారు. 

మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగదని ఆయన జోస్యం చెప్పారు. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగలేదని, ఎన్నికల అధికారులు బీజేపీకి అనుకూలంగా పనిచేశారని విమర్శించారు. ఎమర్జెన్సీ తర్వాత ఏ ప్రధాని కూడా ఈడీ, సీబీఐని ఇంతలా దురి్వనియోగం చేయలేదన్నారు. రాష్ట్రాల్లో పాలన సాగిస్తున్న ప్రతిపక్ష పారీ్టలపై వివక్ష పూరిత వైఖరి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. బెనర్జీ తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత, బీజేపీకి చెందిన భూపేందర్‌ యాదవ్‌ మాట్లాడుతూ, ఎన్డీఏ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూలపై చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ ఓంబిర్లాను కోరారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement