బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ్‌తో తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ వాగ్వాదం
ఆవేశంతో ఊగిపోతూ గాజు సీసాను పగులగొట్టిన బెనర్జీ
ఆయనపై ఒకరోజు సస్పెన్షన్ వేటు
న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశం వాగ్వాదాలకు వేదికగా నిలిచింది. రసాభాసగా మారిన ఈ సమావేశంలో తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ పట్టరాని ఆవేశంతో గాజు నీళ్లసీసా పగలగొట్టారు. సమావేశాన్ని గలాటాకు వేదికగా మార్చారంటూ బెనర్జీని కమిటీ నుంచి ఒక రోజుపాటు సస్పెండ్ చేశారు. బీజేపీ నేత జగదాంబికాపాల్ అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో చర్చ సందర్భంగా బీజేపీ నేత, కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ్‌తో టీఎంసీ నేత కల్యాణ్ బెనర్జీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బిల్లును బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ సమయంలో తీవ్ర ఆవేశానికి లోనైన బెనర్జీ గాజు నీళ్ల సీసాను పగలగొట్టి చైర్మన్ కుర్చీ వైపుగా విసిరారు. ఈ క్రమంలో అది బెనర్జీ కుడి బొటనవేలుకు కోసుకుపోయింది. ప్రథమ చికిత్స చేసి కుట్లువేశాక ఆయన మళ్లీ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, ఆప్ నేత సంజయ్ సింగ్‌లతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. బెనర్జీ ఆవేశపూరిత చర్యలను మెజారిటీసభ్యులు ఖండించారు. సభ్యుల ఆవేశాలు చూస్తుంటే రేపు పొద్దున ఇంకొకరు ఇలాగే రివాల్వర్‌తో కమిటీకి వస్తారేమో అని చైర్మన్ పాల్ అసహనం వ్యక్తంచేశారు. బెనర్జీని సస్పెండ్ చేయాలంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే చేసిన తీర్మానాన్ని 10–8 మెజారిటీతో ప్యానెల్ ఆమోదించింది. దీంతో బెనర్జీ కోపంతో సమావేశం నుంచి అర్ధాంతరంగా బయటకు వెళ్లిపోయారు.
న్యాయవాదులు, మాజీ జడ్జీలతో కూడిన రెండు ఒడిశా ప్రతినిధి బృందాలతో ప్యానెల్ మాట్లాడుతుండగా ఈ గొడవ జరిగింది. వక్ఫ్ బిల్లుతో వీళ్లకు ఏం సంబంధమని బెనర్జీ నిలదీసినట్లు తెలుస్తోంది. తొలుత బెనర్జీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న చైర్మన్ ఆ తర్వాత పదేపదే బెనర్జీ కలగజేసుకోవడాన్ని తప్పుబట్టడం, దీనికి అభిజిత్ గంగోపాధ్యాయ్ మద్దతు పలకడంతో గంగోపాధ్యాయ్‌తో బెనర్జీ వాగ్వాదానికి దిగారు. ఉద్దేశపూర్వకంగా బాటిల్‌ను విసిరేయలేదని తర్వాత బెనర్జీ వివరణ ఇచ్చారు. వర్షాకాల సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా అభ్యంతరాల నేపథ్యంలో పరిశీలన నిమిత్తం బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసిన సంగతి తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment