సాక్షి, హైదరాబాద్: గాంధీ భవన్‌లో మూడు గంటలకుపైగా సాగిన టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ముగిసింది. అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కమిటీ మీటింగ్‌ను హైకమాండ్ ఆదేశాలతోనే నిర్వహించినట్లు రేవంత్ స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్రపై భేటీలో చర్చించినట్లు చెప్పారు. ఈ నెల 20 నుంచి 24 వరకు అన్ని జిల్లాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో ఇన్‌ఛార్జ్‌ల నియామకం ఉంటుందన్నారు. కొత్త కమిటీల నియామకాలతో పాత కమిటీలు రద్దు అవుతాయన్నారు.
అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకునే కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 43 లక్షల సభ్యత్వాలు నమోదు చేసినట్లు వివరించారు. మోదీ, కేసీఆర్ వైఫల్యాలను ఛార్జ్‌షీట్ రూపంలో ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ వెళ్లేలా కార్యక్రమం తీసుకుంటున్నట్లు చెప్పారు. జనవరి 3,4 తేదీల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. తాను చేపట్టే పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువవుతానని రేవంత్ చెప్పారు.
వార్ రూంపై దాడి చేసింది పోలీసులు కాదు, గూండాలని తమకు అనుమానంగా ఉందని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ డేటాను దొంగల్లా ఎత్తుకెళ్లారని ఆరోపించారు. తమ పార్టీ నేతలు, నిపుణులపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని రేవంత్ ధ్వజమెత్తారు. ఉత్తమ్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు.
కమిషనర్ సీవీ ఆనంద్‌పై అసహనం..
హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్‌పై రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఆయన ఏపీఎస్ ఆఫీసరా లేక ఓ పార్టీ కార్యకర్తా అని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై తాను వ్యతిరేక పోస్టులు పెట్టానని ఎలా చెబుతారని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టులను తనకు అంటగట్టవద్దని సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడి కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే కోరుకునే వక్తినని చెప్పారు. కేసీఆర్‌కు అబద్దాలు చెప్పి డీజీపీ పదవి పొందాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు.
కాగా, టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి ముందు హైడ్రామా చోటుచేసుకుంది. ఈ భేటీకీ సీనియర్ నాయకులు గైర్హాజరయ్యారు. కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీల్లో టీడీపీ నుంచి వచ్చిన వలస నేతలకే ప్రాధాన్యం ఇచ్చారని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వర్గీయులు 12 మంది తమ పదవులకు రాజీనామా చేశారు. పదవులు రాలేదని బాధపడుతున్న వారికి వాటిని అప్పగించాలని సూచించారు.
చదవండి: కాంగ్రెస్‌లో మరింత ముదిరిన సంక్షోభం.. పీసీసీ పదవులకు 12 మంది రాజీనామా
Comments
Please login to add a commentAdd a comment