సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు పోలీసులు బేడీలు వేసిన ఘటనపై టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరుతున్న రైతులకు బేడీలు వేయడం ఏమిటంటూ నిలదీశారు. పరిహారం అడిగిన పాపానికి వారిపై లాఠీచార్జి చేయడమే కాకుండా అత్యంత దౌర్జన్యంగా ప్రవర్తించారని, గజ దొంగల్లా వారిని చూశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు హద్దులు దాటుతున్నాయని మండిపడ్డారు. ఈ ఉదంతంపై సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.
పరిహారంలో తేడాలు ఎందుకు?
కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన గౌరవల్లి ప్రాజెక్టులో కేసీఆర్ పేర్కొన్న రీ డిజైన్ ఫలితంగా ముంపు గ్రామాల సంఖ్య ఒకటి నుంచి ఎనిమిదికి పెరిగిందని రేవంత్ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో ఏ మూలకు పోయినా ఎకరం ధర రూ. 20–30 లక్షలకు తక్కువ లేదని చెప్పిన సీఎం కేసీఆర్... గౌరవల్లి నిర్వాసితుల భూములకు మాత్రం ఆ ధర ఎందుకు వర్తింపజేయట్లేదని ప్రశ్నించారు.
పునరావాసానికి సంబంధించి కొందరికి ఎకరాకు రూ. 2.10 లక్షలు, మరికొందరికి రూ. 6.90 లక్షల పరిహారం అందించినట్లు ప్రభుత్వ అధికారులే చెబుతున్నారని రేవంత్ గుర్తుచేశారు. అది కూడా అన్ని కుటుంబాలకు పరిహారం అందలేదన్నారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లు కావొస్తున్నా 186 మందికి పరిహారం అందలేదని, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మైనర్లుగా ఉండి.
తర్వాత మేజర్లయిన వారిని కుటుంబంగా పరిగణించి ఒక్కొక్కరికీ రూ. 8 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని రేవంత్ డిమాండ్ చేశారు. రైతులపై కేసులను తక్షణమే ఉపసంహరించుకోవడంతోపాటు నిర్వాసితులు కోరుకున్నట్లుగా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, డబుల్ బెడ్రూం ఇళ్లు, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment