సాక్షి, హైదరాబాద్: ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో ఈసీ నిబంధనల మేరకు స్థానికేతర నేతలు, శ్రేణులంతా మునుగోడు నియోజకవర్గం బయటకు వచ్చినా ఈ నెల 3న పోలింగ్ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఓటర్లపై పట్టు సడలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో యూనిట్ ఇన్‌చార్జిలుగా వ్యవహరించిన ముఖ్య నేతలు కొందరు జిల్లా కేంద్రం నల్లగొండలో, మరికొందరు హైదరాబాద్ శివార్లలో మకాం వేసి చివరి నిమిషం వరకు మునుగోడు పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయాలని నిర్ణయించారు.
ప్రతి వంద మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్‌చార్జిలుగా పనిచేసిన నేతలు కూడా సంబంధిత ఓటర్ల ఫోన్ నంబర్లను సేకరించి, వారితో పోలింగ్ ముగిసేంత వరకు టచ్‌లో ఉండాలని పార్టీ ఆదేశించింది. గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో హైదరాబాద్ శివారు, ఇతర ప్రాంతాల్లో ఓటర్లు ఉండటంతో.. పోలింగ్ రోజున వారు స్వస్థలాలకు తరలివెళ్లి తమకు అనుకూలంగా ఓటు వేసేలా టీఆర్‌ఎస్ జాగ్రత్తలు తీసుకుంటోంది.
నేడు సీఎం టెలీ కాన్ఫరెన్స్
సుమారు 20 రోజులు ప్రచార సరళిని విశ్లేషించుకున్న టీఆర్‌ఎస్.. ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని 298 పోలింగ్ బూత్‌ల పరిధిలో తమ అభ్యర్థికి పడే అవకాశమున్న ఓట్ల సంఖ్యపై ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. అయితే ప్రలోభాల పర్వం జోరుగా సాగుతుండటంతో పార్టీ అంచనాలు, లెక్కలు తప్పకుండా ఉండేందుకు గురువారం పోలింగ్ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించింది.
వివిధ సంస్థలు, నిఘా వర్గాల నుంచి అందిన నివేదికల ఆధారంగా సీఎం కేసీఆర్ బుధవారం మునుగోడు ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశముందని తెలిసింది. పక్షం రోజులుగా నియోజకవర్గంలోనే మకాం వేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్డీ కేడర్ కలుపుకొని సుమారు మూడు వేల మంది ప్రచారంలో పాల్గొన్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.
చదవండి: మునుగోడును ముంచెత్తారు.. చివరిరోజు హోరెత్తించిన ప్రధాన పార్టీలు
Comments
Please login to add a commentAdd a comment