ఒక సిద్ధాంతం లేదు.. కానీ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటానంటాడు.. ఆ సిద్ధాంతం ఏంటో మాత్రం చెప్పడు!
ప్రశ్నించి తీరతానంటాడు.. తీరా సమయం వచ్చే సరికి సీన్‌లో లేకుండా పోతాడు
నమ్మినవాళ్లను నట్టేట ముంచి.. పక్కనోడి జెండా మోయాలనడం బాగా అలవర్చుకున్నాడు
ఎమ్మెల్యేగా నెగ్గకపోయినా.. సీఎం అవుతాడని అభిమానుల కలలు కంటుంటే.. వాటిని తుంచేస్తాడు
కులం కులం లేదంటూనే.. కుల రాజకీయాలు చేయాలని తీవ్రంగా యత్నించి భంగపడుతుంటాడు
సినిమానా? రాజకీయమా? ఎటూ తేల్చుకోని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంటాడు
పవన్ ఇక పార్ట్ టైం పొలిటీషియనా? .. ఆ విషయం తన నోటితోనే చెప్పేశాడా?
కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క.. తెలంగాణ ఎన్నికల సమయంలో తెగ ట్రెండ్ అవుతున్న పేరు. తెలంగాణలో ఉద్యోగ అవకాశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే.. తన అసహనాన్ని బర్రెలు కాస్తూ ప్రకటించిందామె. ఆపై సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా ఈ-సెలబ్రిటీగా మారిపోయింది. ఎవరూ ఊహించని రీతిలో నాగర్‌కర్నూల్ కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా నామినేషన్ వేసింది. ఆపై కొందరు నిరుద్యోగులు ఆమెకు అండగా కదిలి వచ్చారు. చందాలేసి మరీ బర్రెలక్క కోసం ప్రచారంలోకి దిగారు. దీంతో ఆమె వార్తల్లో నిలిచింది. ఆమెపై నాటకీయ పరిణామాల నడుమ ఆమె వర్గంపై జరిగిన దాడి.. మీడియా ముఖంగా ఆమె కన్నీటి పర్యంతం.. అటుపై అనూహ్యంగా లభిస్తున్న మద్దతు చర్చనీయాంశంగా మారాయి. యువత పోటీకి దిగితే.. ఇలాంటి పరిణామాలా? అంటూ ఆమె ప్రశ్నించడం తెలంగాణ సమాజంలో చాలామందిని కదిలించింది కూడా. మరి.. తొమ్మిదిన్నరేళ్లుగా ఓ పార్టీని నడుపుతూ.. అంతకు ముందు ఆరేళ్ల కిందటే మరో పార్టీ యువ విభాగానికి పని చేసిన రాజకీయ అనుభవం ఉండి పవన్ చేస్తోందేంటి?..
టీడీపీ తొత్తు పార్టీ ట్యాగ్‌తో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలచేత ‘అన్‌ఫిట్’ అనిపించుకున్న పవన్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నేరుగా పోటీ చేసే ధైర్యం చేయలేదు. అందుకు పార్టీ విస్తరణ, ఉనికిపరమైన కారణాలు ఉండొచ్చు. కానీ, అప్పుడెప్పుడో తొందరపడి 32 సీట్లకు పోటీ అని ప్రకటించుకుని.. చివరాఖరికి బీజేపీ మద్దతుతో 8 సీట్లలో(నామమాత్రమేమో!) పోటీకి దింపుతున్నాడు. పోనీ ఆ అభ్యర్థుల గెలుపు కోసం అయినా తీవ్రంగా యత్నిస్తున్నాడా? అంటే.. ఇక్కడా సీరియస్‌లెస్ రాజకీయాలే!.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు పట్టుమని వారం రోజులు కూడా లేదు. ప్రచారంలోకి దిగిందే ఆలస్యంగా.. ఇప్పుడేమో టైం లేదంటూ నేరుగా ప్రకటన చేశాడు. మీరూ మీరే ఇక చూసుకోవాలని.. మద్దతు ఇవ్వాలని జనసేన శ్రేణులకు సలహా ఇచ్చాడు. అంటే.. ఓటమికి పవన్ ప్రిపేర్ అయిపోయినట్లేనా?.
ధరణి విఫలం, పేపర్ లీక్స్.. ఇవి తెలంగాణ ప్రభుత్వంపై పవన్ చేసిన విమర్శలు. ఇవి పైపై విమర్శలే!. లోతుగా వెళ్లి విమర్శించే ధైర్యం చూపించలేదు. పైగా రాజకీయాల్లో తాను విమర్శలు చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయంటూ కబుర్లు చెబుతున్నాడు. తెలంగాణలో ఎక్కువ తిరగలేదంట. కేటీఆర్‌తో, రేవంత్‌తో స్నేహం ఉందంట.. రాజకీయాలు, స్నేహం వేరట. కానీ, మోదీ నాయకత్వంలో పని చేస్తాడట. తెలంగాణలో, దేశంలోనూ బీజేపీనే అధికారంలోకి రావాలంటున్నాడు. బీజేపీతో కలిసి మనస్ఫూర్తిగా పని చేయాలని.. ఆ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని జనసేన కేడర్‌కు పవన్ పిలుపు ఇస్తున్నాడు.
నిన్న వరంగల్‌లో.. ఇవాళ కొత్తగూడెంలో.. పవన్ ఈ సూటి వ్యాఖ్యలే చేశాడు. మద్ధతు ఇవ్వాలి అంటున్నారు కానీ, కనీసం గెలిపించాలని అనే మాట కూడా పవన్ నోట రావడం లేదు. గద్దర్ ఆశయం గెలిపించాలంటూ ఓ భారీ డైలాగ్ కొట్టాడు. మరి గద్దర్ కూతురు కాంగ్రెస్ అభ్యర్థి అనే సంగతి పవన్ మరిచిపోయి ఉంటాడేమో. గత రెండు రోజులుగా ప్రచారంలోకి దిగి పవన్ చేస్తున్న ప్రసంగాలు చూస్తే.. రాజకీయాల్లో ఓనమాల దశలో ఉన్న బర్రెలక్కలాంటి వాళ్లు ఇంతకంటే పరిణితి ప్రదర్శిస్తున్నారనే ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. చిన్నవయసులోనే పోటీ.. నామినేషన్ దగ్గరి నుంచి ప్రచారంలోనూ ఆమె కనబరుస్తున్న చిత్తశుద్ధికి, ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
అటు ఏపీలోనేమో తెలుగు దేశం పార్టీకి మద్దతు.. పొత్తుగా జనసేనను తాకట్టు పెట్టాడు. రేపు ఎన్నికల సమయంలో చంద్రబాబు విసిరే ఐదు పది సీట్లను మహాప్రసాదం అనుకోడని గ్యారెంటీ ఏంటి?. అప్పుడు ప్రచారంలోనూ ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే చాలని అనకుండా ఉంటాడా?. అందులో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. కాబట్టి.. జనసైనిక్స్ ఫిక్స్ అయిపోండి. పవన్ సర్.. ఇక పార్ట్‌టైం పొలిటీషియనే!.
:::సాక్షి డిజిటల్ పొలిటికల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment