సాక్షి, హైదరాబాద్: డీకే శివకుమార్.. కర్ణాటక ఎన్నికల ఫలితాల సమయాల్లో, అక్కడ రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడల్లా ఎక్కువగా వినిపించే పేరు. నెగ్గిన అభ్యర్థుల్ని జంప్ కాకుండా.. సంక్షోభ సమయాల్లో పార్టీ ఎమ్మెల్యేలను ఏకతాటిపై ఉంచడంలో ఈయన ఎక్స్‌పర్ట్. అందుకే పాలిటిక్స్‌లో ట్రబుల్ షూటర్ అనే పేరొచ్చింది ఆయనకి. క్లిష్టపరిస్థితుల్లో పార్టీని ఆదుకునే డీకేఎస్.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కట్టబెట్టిన విజయం కాంగ్రెస్‌కు మరువలేనిది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ.. కాంగ్రెస్ అధిష్టానం ఆయన సేవల్ని మళ్లీ వినియోగించుకుంటోంది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డీకేఎస్‌ను నమ్ముకుంది. తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలోనూ ఆయన క్రియాశీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసి ప్రచారంలో పాల్గొన్నారాయన. కర్ణాటక సంక్షేమ రిఫరెన్స్‌తో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారాయన. ఇప్పుడు.. రేపు ఫలితాల సమయంలో ఆయన ఇక్కడే మకాం వేసి చక్రం తిప్పబోతున్నారు.
మ్యాజిక్ ఫిగర్‌కు అటు ఇటుగా ఫలితాలు ఉంటే.. పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా బాధ్యత ఆయన చేతుల్లోకి వెళ్లింది. తెలంగాణ ఫలితాలు వెలువడ్డాక.. ఆ నెగ్గిన వాళ్లను బెంగళూరుకు తరలిస్తారనే ప్రచారం ఒకటి తొలుత నడిచింది. అయితే ఆ ఊహాగానాల్ని స్వయంగా డీకేఎస్ కొట్టిపారేశారు. ఎమ్మెల్యేలను ఎక్కడికి తరలించబోమని.. ఆ అవసరం లేదని అన్నారాయన. అలాగే.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడుతుండగా.. అంతకు ఒక్కరోజు ముందే ఆయన హైదరాబాద్‌లో ల్యాండ్ కానున్నారు.
కాంగ్రెస్ బిగ్‌ప్లాన్
ఫలితాల రోజున తెలంగాణ కాంగ్రెస్ బిగ్‌ప్లాన్ అమలు చేయబోతోంది. ఏఐసీసీ ప్రతీ నియోజకవర్గానికి ఒక పరిశీలకుడ్ని నియమించింది. సదరు అభ్యర్థి నెగ్గాక.. ఎమ్మెల్యే సర్టిఫికెట్‌తో ఆ పరిశీలకుడు నేరుగా హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌కు తీసుకొస్తారు. అక్కడ డీకేఎస్ సమక్షంలోనే వాళ్లు ఉండనున్నారు. ఒకవేళ సంపూర్ణ మెజారిటీ వచ్చినా కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని డీకేఎస్ భావిస్తున్నారట. ఎమ్మెల్యేలను ఎట్టిపరిస్థితుల్లో ప్రలోభాలకు గురి కాకుండా చూసుకునే బాధ్యత ఇప్పుడే ఆయన స్వయంగా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.
‘‘తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మాకు పూర్తి మెజారిటీ వస్తుంది. మేం ఎలాంటి క్యాంపు రాజకీయాలు పెట్టడం లేదు. కొంత మంది మా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మాకు సమాచారం ఉంది. కానీ, మా వాళ్లు పార్టీకి విధేయులు. లొంగరు..’’ డీకేఎస్ తాజాగా ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇది.
ఇదీ చదవండి: ఆగమెందుకు.. మళ్లీ మనమే
Comments
Please login to add a commentAdd a comment