గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీపై ఆశావహుల నజర్‌  | Two Governor's Quota MLC seats fall vacant in the State Legislative Council | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీపై ఆశావహుల నజర్‌ 

Published Fri, Mar 31 2023 3:58 AM | Last Updated on Fri, Mar 31 2023 3:58 AM

Two Governor's Quota MLC seats fall vacant in the State Legislative Council - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనమండలిలో రెండు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండటంతో బీఆర్‌ఎస్‌ నేతల్లో ఆశలు మొదలయ్యా యి. ఇప్పటికే పలువురు ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఇతర పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

గవర్నర్‌ కోటాలో శాసనమండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న డి.రాజేశ్వర్‌రావు, ఫారూఖ్‌ హుస్సేన్‌ల ఆరేళ్ల పదవీ కాలం ఈ ఏడాది మే 27న ముగియనుంది. ఈ స్థానాల్లో సభ్యుల పేర్లను గవర్నర్‌కు ప్రతిపాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 9న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ భేటీలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను సిఫార్సు చేస్తారనే సంకేతాలు వెలువడినా చివరి నిమిషంలో వాయిదా పడినట్టు తెలిసింది. 

మళ్లీ అవకాశం కోసం.. 
పదవీకాలం పూర్తి చేసుకోనున్న డి.రాజేశ్వర్‌రావు, ఫారూఖ్‌ హుస్సేన్‌ ఇద్దరూ మైనారిటీ వర్గానికి చెందిన నేతలే కావడంతో.. మళ్లీ అదే కేటగిరీకి చెందిన వారికి పదవులు దక్కుతాయనే ప్రచారం బీఆర్‌ఎస్‌లో జరుగుతోంది. డి.రాజేశ్వర్‌రావు రెండుసార్లు కాంగ్రెస్‌ నుంచి, ఒకసారి బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీగా నామినేట్‌ అయ్యారు. ఫారూఖ్‌ హుస్సేన్‌ కూడా ఒకసారి కాంగ్రెస్, మరోసారి బీఆర్‌ఎస్‌ నుంచి శాసనమండలిలో అడుగుపెట్టారు. మరోసారి గవర్నర్‌ కోటాలో ఎంపికయ్యేందుకు ఈ ఇద్దరూ ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. 

రెండింటిలో ఒక మహిళకు చాన్స్‌ 
శాసనమండలిలో 40మంది సభ్యులు ఉండగా అందులో ముగ్గురే మహిళలు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన సత్యవతి రాథోడ్‌ మంత్రిగా పనిచేస్తుండగా, స్థానిక సంస్థల కోటాలో కల్వకుంట్ల కవిత, పట్టభద్రుల కోటాలో సురభి వాణీదేవి ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ కోటాలో నామి నేట్‌ చేసే ఇద్దరిలో ఒక మహిళకు చాన్స్‌ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మైనారిటీ వర్గానికి చెందిన మహిళను గవర్నర్‌ కోటాలో నామినేట్‌ చేయాలనే యోచనలో ఉన్న కేసీఆర్‌ అభ్యర్థి ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

ఇంతకుముందు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డి పేరును ప్రభుత్వం సిఫార్సు చేసినా గవర్నర్‌ తమిళిసై ఆమోదించలేదు. దీనితో ఈసారి గవర్నర్‌ కోటా అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, విద్యావేత్త, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఘంటా చక్రపాణి పేర్లు కూడా కేసీఆర్‌ పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. ఏప్రిల్‌ రెండోవారంలో కేబినెట్‌ సమావేశం నిర్వహించి గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం ఖరారు చేయనున్నట్టు సమాచారం. 

నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం 
ఎమ్మెల్యే కోటాలో ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలు శుక్రవారం ఉదయం 9.30కు శాసనమండలి చైర్మన్‌ చాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మె ల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఉన్న కుర్మయ్యగారి నవీన్‌కుమార్, వి.గంగాధర్‌గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి ఆరేళ్ల పదవీకాలం గురువారంతో పూర్తయింది. వీరిలో కుర్మయ్యగారి నవీన్‌కుమార్‌ రెండోసారి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికకాగా.. మిగతా రెండు స్థానాల్లో కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి ఎంపికయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement