
టీడీపీ నేతలకే దక్కిన రైల్వేకోడూరు, అవనిగడ్డ జనసేన సీట్లు
బాబు ఒప్పుకోలేదని రైల్వేకోడూరు అభ్యర్ధిని మార్చేసిన పవన్
ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ప్రధాన అనుచరుడికి టికెట్
పవన్ నిర్ణయంపై మండి పడుతున్న పార్టీ నేతలు
ఎన్నికల్లో దూరంగా ఉండాలని నిర్ణయం?
సాక్షి, అమరావతి/సాక్షి, మచిలీపట్నం/ఓబులవారిపల్లె/అవనిగడ్డ : చంద్రబాబుతో పొత్తంటే బాబు మెచ్చిన వాళ్లకి, బాబు చెప్పిన వాళ్లకి, బాబు పంపిన వాళ్లకి టికెట్లిచ్చేయడమే. జనసేనకు కేటాయించిన మరో రెండు సీట్లనూ చంద్రబాబు ఇలాగే కొట్టేశారు. పొత్తులో భాగంగా జనసేనకు వచ్చిన అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు అభ్యర్థిని మార్చగా, కృష్ణా జిల్లా అవనిగడ్డ స్థానానికి మొన్నటివరకు టీడీపీ నేత, రెండురోజుల క్రితం జనసేనలోకి వచ్చిన అసెంబ్లీ మాజీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. బుద్ధప్రసాద్‌కు సీటు కేటాయించడం అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేనలో చిచ్చు రేపింది.
ఈ టికెట్ ఆశించిన పలువురు జనసేన నేతలు కూటమి అభ్యర్థికి సహకరించకూడదని నిర్ణయించారు. మరికొందరు నేతలు వారి పదవులకు రాజీనామా చేస్తున్నారు. కాగా జనసేనకు కేటాయించిన మరో నియోజకవర్గం పాలకొండ అసెంబ్లీ స్థానం అభ్యర్థిని రెండు రోజుల్లో నిర్ణయాన్ని ఆ పార్టీ తెలిపింది. ఎస్సీ రిజర్వ్డ్ అయిన రైల్వేకోడూరు నియోజకవర్గం అభ్యర్థిగా యనమల భాస్కరరావును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇంతకు ముందే ప్రకటించారు.
ఈయన అభ్యర్థిత్వానికి చంద్రబాబు మోకాలడ్డారు. అక్కడ తాను చెప్పిన వ్యక్తికి టిక్కెటివ్వాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో పవన్‌కు అభ్యర్థిని మార్చక తప్పలేదు. అక్కడ ఇప్పుడు ఆ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి ముక్కా రూపానందరెడ్డి ప్రధాన అనుచరుడు, ముక్కవారిపల్లి సర్పంచ్ అరవ శ్రీధర్‌ను జనసేన అభ్యర్థిగా ప్రకటించారు. ‘రైల్వే కోడూరు స్థానానికి ఇప్పటికే ఎనమల భాస్కర్ పేరును పవన్ ప్రకటించారు. ఈయన అభ్యర్థిత్వంపై సర్వేల్లో సానుకూలత రాలేదు. మిత్రపక్షమైన తెలుగుదేశం వైపు నుంచి కూడా అనుకూలత లేకపోవడంతో లోతుగా అధ్యయనం చేస్తున్నాం.
అక్కడ అభ్యర్థిని మార్చాలని నాయకులు అభిప్రాయాలను తెలియజేశారు’ అని పవన్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గురువారం ఉదయం ప్రకటన జారీ చేశారు. సాయంత్రానికి మళ్లీ మరో ప్రకటన విడుదల చేశారు. రైల్వే కోడూరు శాసనసభ స్థానం నుంచి పోటీ చేసే జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును పార్టీ అధ్యక్షులు పవన్ ఖరారు చేసినట్టు హరిప్రసాద్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు.
అవనిగడ్డ బుద్ధప్రసాద్‌కే
అవనిగడ్డ శాసన సభ స్థానం జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును పార్టీ అధ్యక్షులు పవన్ ఖరారు చేసినట్టు హరిప్రసాద్ మరో ప్రకటనలో పేర్కొన్నారు. బుద్ధప్రసాద్ గత ఎన్నికల్లో అవనిగడ్డ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారీ అవనిగడ్డ నుంచి పోటీ చేయాలని ఆశించారు.
అయితే ఈ స్థానం జనసేనకు వెళ్లడంతో ఆయన ఆశలకు గండి పడింది. ఈ సీటు కోసం గట్టిగా ప్రయత్నించారు. మరోపక్క ఇన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న జనసేన నేతలూ టికెట్ కోసం గట్టిగా పట్టుపట్టారు. దీంతో ఇక్కడ జనసేన అభ్యర్థి ఎంపిక గందరగోళంలో పడింది. పార్టీ ఆవిర్భావం నుంచి పని చేసిన వారిని కాదని, ఇటీవలే టీడీపీ నుంచి జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్‌కే పవన్ టికెట్ ఇచ్చారు.
వీరి ఆశలపై నీళ్లు
అవనిగడ్డ అసెంబ్లీ టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న జనసేన నేతలకు పార్టీ అధినేత పవన్ మొండి చేయి చూపారు. ఆ పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు, తొలి నుంచి పార్టీలో ఉన్న బండ్రెడ్డి రామకృష్ణ, కాంట్రాక్టర్ విక్కుర్తి శ్రీను, ఎన్‌అర్‌ఐ బొబ్బా గోవర్ధన్, మచిలీపట్నం కన్వీనర్ బండి రామకృష్ణ టిక్కెట్ ఆశించారు. ముందు నుంచి పార్టీలో ఉంటూ కష్టపడి పనిచేసిన వారికి కాకుండా కొత్తగా చేరిన మండలికి టికెట్ ఇవ్వడం వెనుక బాబు హస్తం ఉందని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగా పార్టీలో చేరిన మండలికి టికెట్ ఇస్తే సహకరించబోమని, తమ పార్టీ నాయకుల్లో ఎవరికి ఇచ్చినా పని చేస్తామని ఇటీవలే జనసేన నేలు బహిరంగంగానే ప్రకటించారు. అయినా వారి మాటను ఖాతరు చేయకుండా టిక్కెట్‌ను మండలికే ఇవ్వడంతో ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉండాలని సీనియర్ నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోపక్క పార్టీ నిర్ణయాన్ని నిరసిస్తూ పలువురు నాయకులు రాజీనామా బాట పట్టారు.
జనసేన ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు గురువారం పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను వాట్సప్ ద్వారా పార్టీ అధ్యక్షుడు పవన్‌కు పంపినట్లు చెప్పారు. మిత్రులు, శ్రేయోభిలాషులతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ తెలియజేస్తానన్నారు. జనసేన అవనిగడ్డ టౌన్ ప్రధాన కార్యదర్శి అన్నపరెడ్డి ఏసుబాబు, పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సభ్యుడు చెన్నగిరి సత్యనారాయణ కూడా పదవులకు రాజీనామా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment