సాక్షి, హైదరాబాద్: ‘పార్లమెంట్ ఉంది యుద్ధాలు చేసేందుకు కాదు.. ప్రజా సమస్యలపై చర్చించేందుకు’ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో యుద్ధం చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునివ్వడంపై ఆయనపై ఈ విధంగా స్పందించారు. శుక్రవారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పీఠం కదిలిపోతోంది కాబట్టే బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
అందువల్లే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ కేసీఆర్ మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలపై కేసీఆర్ బలవంతంగా కుటుంబ పాలనను రుద్ది, నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాటు తమ కేబినెట్‌లో మహిళలకు మంత్రి పదవి ఇవ్వని కేసీఆర్ వద్ద తాము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కార్‌దేనని మరోసారి కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు.
రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న మేరకు ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గత 8 ఏళ్లుగా ధాన్యం తామే కొంటున్నామని చెబుతూ వచ్చిన కేసీఆర్, ఇప్పుడు మోదీ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే బియ్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదేనని చెప్పారు. భారీవర్షాలు, వరదల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్ర బృందాలు పర్యటిస్తాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment